● అదనపు ఎస్పీ
ఎం.వెంకటేశ్వర రావు
పార్వతీపురం రూరల్: బాధితుల సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితులతో ఆయన ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, వృద్ధులపై వేధింపులు, గృహహింస, భూవివాదాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ వంచన తదితర సమస్యలపై ఈ కార్యక్రమంలో మొత్తం ఐదు ఫిర్యాదులు అందాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అదనపు ఎస్పీ..వెంటనే సంబంధిత స్టేషన్‌ల పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదుల్లోని వాస్తవాలను విచారించి, చట్ట పరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, తీసుకున్న చర్యలపై జిల్లా ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఎస్సై అశోక్ చక్రవర్తి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 37 వినతులు
సీతంపేట: ఐటీడీఏలోని ఎస్‌ఆర్‌శంకరన్ సమావేశ మందిరంలో పీహెచ్‌వో ఎస్.వి గణేష్ నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు గిరిజనులు వివిధ సమస్యలపై 37 వినతులు సమర్పించారు. పవర్‌స్ప్రేయర్ ఇప్పించాలని శోభనాపురానికి చెందిన కొండగొర్రె నూకరాజు అర్జీ ఇచ్చారు. ఆర్‌వోఎర్ పట్టా ఇప్పించాలని బిడ్డిక వెంకటమ్మ కోరింది. జోగిపాడుకు చెందిన దుర్గారావు సెల్‌పాయింట్ పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని విన్నవించాడు. వెంకటిగూడకు వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని ఎస్.సింహాచలం తదితరులు కోరారు. వెన్నెలవలస గ్రామానికి చెందిన కె.గౌతమ్ గ్రూపులో సరుబుజ్జిలి జూనియర్ కళాశాలలో సీటు ఇప్పించాలని కోరాడు. కార్యక్రమంలో డిప్యూటీఈఓ నారాయుడు, వ్యవసాయాధికారి వాహిని, ఏపీడీ ఎం.వి రమణ తదితరులు పాల్గొన్నారు.


