47 మంది డిప్యూటీ వార్డెన్ల మార్పు | - | Sakshi
Sakshi News home page

47 మంది డిప్యూటీ వార్డెన్ల మార్పు

Feb 28 2026 7:39 AM | Updated on Feb 28 2026 7:39 AM

47 మంది డిప్యూటీ వార్డెన్ల మార్పు

47 మంది డిప్యూటీ వార్డెన్ల మార్పు

47 మంది డిప్యూటీ వార్డెన్ల మార్పు పదో తరగతి ఫలితాలపై ప్రభావం?

సాక్షి, పార్వతీపురం మన్యం: ఇటీవల కాలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న వరుస ఘటనలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఐటీడీఏ పరిధిలోని డిప్యూటీ వార్డెన్లను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ట వేయడం.. పైరవీలు చేసుకుని అక్కడే ఉండిపోవడానికి ప్రాధాన్యమివ్వడం, పర్యవేక్షణను గాలి కొదిలేయడంతో ఆశ్రమ పాఠశాలలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. నీలకంఠాపురం ఘటన తర్వాత మరిన్ని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఐటీడీఏ పరిధిలోని 47 మంది డిప్యూటీ వార్డెన్లను ఒకేసారి మార్పుచేసింది. ఆ స్థానంలో మరోచోట నుంచి ఉపాధ్యాయులను నియమించింది. వారికి అనుకూలమైన చోటుకు ప్రాధాన్యమిస్తూనే.. బదిలీ చేసిన స్థానంలోకి అయిష్టత వ్యక్తం చేసిన వారినీ కచ్చితంగా వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. కొంతమందికి చీటీలు వేసి మరీ.. ఆ స్థానానికి పంపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల సమయంలో డిప్యూటీ వార్డెన్ల మార్పుపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల విద్యాప్రమాణాల మీద కొత్తగా వచ్చిన వారికి అవగాహన ఉండదని.. దీనివల్ల ప్రత్యేక శ్రద్ధ దూరమవుతుందని, ఈ ప్రభావం ఫలితాలపై పడుతుందని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఆశ్రమ పాఠశాలల్లో రాత్రి పూట కచ్చితంగా ఉపాధ్యాయులు ఉండాలన్న నిబంధనను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తీసుకొచ్చారు. ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయులంతా హాజరైనట్లు బృంద ఫొటోను తీసుకుని గ్రూపులో అప్‌లోడు చేయాలని పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది ఆలస్యంగా అప్‌లోడు చేయడం.. కొందరు వదిలేయడంపై మెమోలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఒకేసారి పెద్ద సంఖ్యలో డిప్యూటీ వార్డెన్లను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చకుండా ఉపాధ్యాయులను బలిచేయడం ఎంత వరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement