అరాచక శక్తుల అడ్డాగా బొబ్బిలి
చికెన్
బొబ్బిలి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో బొబ్బిలి ప్రాంతం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వేధింపుల అధికార పార్టీ అండగా నిలబడుతోందని, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న పాలకులకు ప్రభుత్వ యంత్రాంగం తలూపుతోందని, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లోకి తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ శంబంగి వెంకటచినప్పలనాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కోమటిపల్లిలో ఒకే రోజు జరిగిన రెండు సంఘటనల్లో గంజాయితో దొరికిన నిందితులను తమ పార్టీ సానుభూతిపరులని ఎమ్మెల్యే చొరవతో పోలీసులు వదిలేశారనాన్నరు. అక్కడే ఫార్మా విద్యార్థులను వేధించిన ఆ గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడి కుమారుడుని పోలీసులు ఏమీ చేయలేక ఎమ్మెల్యే చెబితే విడిచిపెట్టారన్నారు. ఇటీవల మున్సిపల్ వైస్‌చైర్మన్ కారు డ్రైవర్ తన భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, అతడి కుమారుడే సాక్ష్యం చెప్పినా నిందితుడు డ్రైవర్‌పై కేసు పెట్టలేదన్నారు. అభ్యుదయ పాఠశాలలో విద్యార్థుల మధ్య కొట్లాటను కోటలో రాజీ చేశారన్నారు. ఇలా వరుస సంఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని విమర్శించారు.
పోలీసులను సొంత యంత్రాంగంలా..
ఎమ్మెల్యే పోలీసు యంత్రాంగాన్ని సొంత జాగీరులా వాడుకుంటున్నారని శంబంగి ఆరోపించారు. నేరాల్లో నిందితులను కాపాడేందుకు వారి చెప్పుచేతల్లో ఉన్న వారినే ఉంచుతున్నారని, మాట వినకపోతే సాగనంపుతున్నారన్నారు. ఇటీవల పట్టణ సీఐ సతీష్‌కుమార్ ఉదంతమే ఇందుకు సాక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మాట వినకపోవడంతో సీఐని సాగనంపి, వారి కనుసన్నల్లో ఉండే రూరల్ సీఐని టౌన్‌కు తెచ్చుకున్నారని, దీంతో అరాచకవాదులకు, నేరప్రవృత్తి ఉన్న వారికి ధైర్యం వస్తోందన్నారు.
భూకబ్జాల్లో నెంబర్ వన్
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూకబ్జాలు పెరిగిపోయాయని, ఏకంగా పాలకులే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భైరిసాగరం వద్ద గ్రామ కంఠంలో ఉన్న సంతతోట భూమిని ఆక్రమించి పక్క సర్వే నెంబరుతో విక్రయించేశారని, గతంలో మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న చెలికాని వెంకటరావు ఆ భూమిని రైతుల కోసం సంతతోటగా కేటాయిస్తు గ్రామకంఠంలో చేర్చారని ఇప్పుడు దాన్ని నిర్భయంగా తప్పుడు సర్వే నెంబర్లతో విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. మల్లంపేట రైతులకు 1991లో నాటి మంత్రి పెద్దింటి జగన్మోహనరావు హయాంలో 9 ఎకరాల డీ పట్టా భూమలును కేటాయించగా దాన్ని రైతుల నుంచి తిరిగి లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, బాధిత రైతులు లబోదిబోమంటు నిత్యం నిరసనలు తెలియజేస్తున్నారని తెలిపారు. రామన్నదొరవలసలో గిరిజనులకు ఇచ్చిన 20 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములను తిరిగి వారి నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు.
కలెక్టర్ దృష్టి సారించాలి..
బొబ్బిలిలో జరుగుతున్న అరాచకాలు, అధికార దుర్వినియోగం, భూకబ్జాలపై కలెక్టర్ దృష్టి సారించాలని శంబంగి కోరారు. గంజాయి, మహిళల పట్ల జరుగుతున్న వేధింపులు, అధికార పార్టీ ఆగడాలను కట్టడి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అనైతిక కార్యక్రమాలను ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించి దౌర్జన్యాలు, ఆక్రమణలు, భూకజ్జాలు, పోలీసుల పనితీరుపై విచారణ జరపాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు ఇంటి గోపాలరావు, సావు మురళీకృష్ణ, వైఎస్సార్‌సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ శంబంగి వేణుగోపాలనాయుడు, కౌన్సిలర్లు కోట పెదరాములు, పాలవలస ఉమాశంకర్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బొద్దల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి ముఠాలు, మహిళలపై దౌర్జన్యాలు, వేధింపులు
రూ.వందల కోట్ల భూకబ్జాలు
ఎమ్మెల్యే చెప్పుచేతల్లో పోలీసు
యంత్రాంగం
కలెక్టర్ దృష్టి సారించాలి
పాలకుల పాపాలపై మాజీ ఎమ్మెల్యే
శంబంగి ధ్వజం


