కష్టపడి పనిచేసినా టీడీపీలో గుర్తింపు ఉండదు
● అందుకే పార్టీని వీడుతున్నాం
● సీహెచ్‌సీ మాజీ చైర్మన్ మిత్తిరెడ్డి
వెంకటరమణ
గజపతినగరం: తెలుగుదేశం పార్టీలో 1989వ సంవత్సరం నుంచి క్రీయాశీలక సభ్యత్వం తీసుకొని పార్టీ ఆదేశాలకు అనుగుణం కష్టపడి పనిచేశాం... పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేశాం... ఎంత కష్టపడి పనిచేసినా పార్టీలో గుర్తింపు ఉండదు.. కొత్తగా వచ్చిన నాయకులకు ఉన్నంత విలువు సీనియర్లకు ఇవ్వరు.. అవమానాలు భరించి పార్టీలో ఇమడలేమని అర్థమైంది.. అందుకే పార్టీని వీడుతున్నామంటూ గజపతినగరం కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ (సీహెచ్‌సీ) మాజీ చైర్మన్ మిత్తి రెడ్డి వెంకటరమణ, విశ్రాంత అధ్యాపకుడు యడ్ల పైడిపునాయుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కర్రి సత్యనారాయణ పేర్కొన్నారు. గజపతినగరంలోని ఓ ప్రైవేటు భవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీలో చేరిన కొంతమంది నాయకులు వ్యక్తిగత కక్షతోను, స్వార్థపూరిత రాజకీయాలతో తమను మంత్రి నుంచి దూరం చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పార్టీ కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని, ఇక పార్టీకి శాశ్వతంగా దూరమవుతామని స్పష్టంచేశారు. మంత్రి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం గుర్తించలేకపోతున్నారన్నారు. టీడీపీలో కలుషిత రాజకీయం ఎక్కువైందని వాపోయారు. చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మదుపాడకు చెందిన వలిరెడ్డి మురళి, ఇ.గడ్డినాయుడు తదితరులు పాల్గొన్నారు.


