ప్రభుత్వం మారింది.. రహదారి నిర్మాణం ఆగింది...
● గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రారంభమైన పనులు
● కూటమి పాలనతో పడకేశాయి.. ● నెరవేరని గిరిజనుల కల
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల ప్రజల దశాబ్దాల కల ఆ రహదారి. వైఎస్సార్‌సీపీ పాలనలో తొలిసారిగా దారపర్తి పంచాయతీలో గిరిశిఖర గ్రామాలకు రోడ్డు వేయాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. నిధులు కేటాయించింది. భూములు బదలాయించింది. పనులు కూడా ప్రారంభించింది. ఇంతలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ పనులపై కక్ష కట్టింది. పనులు పూర్తయితే ఎక్కడ గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని ఆలోచన చేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఎక్కడి పనులు అక్కడే వదిలేసింది. దీంతో గిరిజనం దశాబ్దాల కల నెరవేరలేదు. మళ్లీ ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. జగనన్న పాలనలో రోడ్డు పూర్తవుతుందని సంబరపడ్డ ఆ గిరిజనానికి నిరాశే మిగిలింది.
జగనన్న పాలనలో..
మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామాలకు రోడ్డు వేయాలని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడ వరకూ ఉన్న 12 గ్రామాలకు 7.5కి.మీ దారిలో రహదారి నిర్మాణం చేయాలన్న గిరిజనులు కొన్ని దశాబ్దాలుగా కోరుతున్నా చంద్రబాబు సర్కారు హయాంలో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరు రోడ్డుకు పి.ఎం.జి.ఎస్.వై–11లో రూ.489.08లు లక్షలు మంజూరు చేసిన పీఆర్ అధికారులు అటవీ శాఖ అనుమతులను కోరారు. అటవీశాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయి.
ముఖం చాటేసిన చంద్రబాబు ప్రభుత్వం
దారపర్తి రోడ్డు పనులు ప్రారంభమై తొలుత ఎర్త్ వర్క్ శరవేగంగా జరిగింది. ఇచ్చిన సమయం అయ్యిందన్న నెపంతో అధికారులు పనులకు మోకాలడ్డారు. తర్వాత ప్రభుత్వం మారింది. కూటమి సర్కారు గిరిజనం సమస్యలపై ముఖం చాటేసింది. దీంతో ఎక్కడి గొంగళి అక్కడే అన్న తీరుగా వర్షాలకు చేసిన ఎర్త్ వర్క్ దెబ్బతింది. రోడ్డులో రాళ్లు రప్పలు తేలాయి. గిరిజనానికి కష్టాలు మిగిలాయి. డోలీ మోతలు మళ్లీ మొదలయ్యాయి.
తొలిసారిగా గిరిజనానికి పలకరింపు
చరిత్రలో తొలిసారిగా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కాలినడకన 2020 ఫిబ్రవరి 1వ తేదీన దబ్బగుంట గ్రామానికి వెళ్లి రోడ్డు పరిశీలించారు. 2023 సెప్టెంబర్ 19న గిరిశిఖర గ్రామాలకు వెళ్లి గడప గడపకు వైఎస్సార్సీసీ కార్యక్రమం నిర్వహించి గిరిజనం వెతలు చూసి, పట్టుబట్టి రోడ్డు పనులపై పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులకు, లేఖలు రాసి, అనుమతులు సాధించటంతో దబ్బగుంట–పల్లపుదుంగాడ రోడ్డులో కదలిక వచ్చింది. అటవీశాఖ రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్న 6హెక్టార్లు భూమిని ఎస్.కోట మండలంలో పెదఖండేపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెం.108లో ఉన్న 15ఎకరాల భూముల్ని అప్పగించటంతో దబ్బగుంట రహదారి సమస్యకు అడ్డంకి తొలగింది.


