గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు విస్తృతం
● డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డైరెక్టర్ రామమోహన్
విజయనగరం టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీఎస్‌ఎన్‌ఎల్ మరింత విస్త్రతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డైరెక్టర్ కె.రామమోహన్ (విజయవాడ) పేర్కొన్నారు. స్థానిక టెలిఫోన్ భవన్‌లో శుక్రవారం డీజీఎం, ఏజీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటల్ భారత్ నిధిలో భాగంగా సిగ్నల్ వ్యవస్థ లేని గ్రామీణ ప్రాంతాలలో 48 కొత్త టవర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొండకరకం, బడుకొండపేట గ్రామాల్లో సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేదని అందిన వినతుల మేరకు స్వీయ పర్యవేక్షణ చేసి, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాలను సైతం కవర్ చేస్తూ మరో 70 టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ రెండు లక్షల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉందన్నారు. ఫోర్‌జీ నెట్‌వర్క్‌తో ఇతర నెట్‌వర్క్‌లకు ధీటుగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీజీఎం దాలినాయుడు, ఏజీఎం మురళి తదితరులు పాల్గొన్నారు.


