రామలక్ష్మి సిగ్గుపడింది
చికెన్
సాక్షిప్రతినిధి, విజయనగరం:
పండక్కి తాతగారి ఊరొచ్చిన రామలక్ష్మి.. పెరటిలో ఒక్కో పువ్వూ తెంచి ఓనీలో వేసుకుంటోంది. చూడమ్మీ ముల్లు గుచ్చీగలవు అన్నాడు అప్పుడే వచ్చిన నాగరాజు. మీ ఊళ్లో మందారాలకు కూడా ముల్లుంటాయేటి అంది కొంటెగా చూస్తూ.. చెస్.. గుంటకు పోత్రం తగ్గలేదు అని మనసులో అనుకుంటూనే ఎప్పుడొచ్చారు.. ఏం చేస్తున్నావన్నాడు. బీఎస్సీ నర్సింగ్ అయింది.. యసోదాలో చేస్తున్నా అని సమాధానం ఇచ్చింది. మరి నన్నేం అడగవా అన్నాడు నాగరాజు..అడగక్కర్లే.. మందారాలకు ముల్లుంటాయని అన్నావంటే నువ్వు బీకామ్ ఫిజిక్స్ అని అర్థమైంది అంది మళ్లీ... దీనికి హైదరాబాద్ వెళ్లిన తర్వాత తెలివెక్కువైంది అనుకుంటుండగానే.. ఎవరితోనే మాటలూ అంటూ తల్లి నాగమణి వచ్చింది. ఎవరో తెలియదమ్మా అంది రామలక్ష్మి. అంతలోనే నాగరాజును చూస్తూ... ఒరే నువ్వా నాగీ.. ఎలాగున్నావు.. ఏం చేస్తున్నావని అడగడంతో వీడికి కాస్త మద్దతు దొరికినట్లై.. బాప్పాబాగున్నా.. మొన్నే వచ్చినాం.. విజయవాడలో ఉంటున్నాం... నేను బీకాం చేసి రొయ్యల కంపెనీలో మేనేజరుగా చేస్తున్నా అన్నాడు గర్వంగా.. ఇంతలో రామలక్ష్మి వచ్చి.. అమ్మా ఎవరే అంది కళ్లతోనే... చిన్నప్పుడు గొర్రెపిల్ల తరిమికొస్తే కోలగూట్లో దాగుందామని దూరిపోయి అందులో ఉన్న పిల్లల బేపికి దొరికిపోయాడని చెప్పాను కదా.. ఆడే వీడు అంది నాగమణి. పాపం నాగరాజు మళ్లీ దెబ్బతినేశాడు.. ఇంత చెండాలంగా ఇంట్రడక్షన్ ఏమిటి అనుకుంటూనే రామలక్ష్మిని చూశాడు.. కళ్లతోనే నవ్వింది.. సరే బాప్పా వెళ్తాను అని కదిలి ఆరేడు అడుగులు వేయగానే నాగీ అని పిలిచింది నాగమణి. బాప్పా అంటూ వెనక్కి తిరిగాడు.. వాడి చూపులు ఆవిడ భుజాలను దాటుకుంటూ వెనుకాల నిలబడిన రామలక్ష్మిని చేరుకున్నాయి.. ఈలోపే.. నాగీ రేపు భోగినాడు అమ్మను నాన్నను రమ్మను.. మాట్లాడాలి అంది... సరే బాప్పా అంటూ వాడు కదిలాడు.. వాడి వెనుకాలే రామలక్ష్మి చూపులు కూడా ఫాలో అయ్యాయి.
మర్నాడు నాగరాజు నాన్న నారాయణ, తల్లి రాజ్యం వచ్చారు.. వస్తూనే... పలకరింపులు అయ్యాక నాగమణి మొదలెట్టింది.. మరేట్రా అన్నయ్యా.. మన రామలక్ష్మిని నాగరాజుకు ఇచ్చి పెళ్లిచేసేద్దాం.. ఎలాగూ చిన్నప్పటి నుంచి ఒనేసిన సంబంధమే కదా.. కొత్తగా అనుకునేది ఏముందీ అంది.. నారాయణ అలాగేలేవే మణీ.. చూద్దాం అన్నాడు.. రాజ్యం కాస్త మాటకారి.. ఎక్కడా మాటపడనివ్వదు.. తన భర్త నారాయణ అమాయకుడని.. ఆయనను ఎవరైనా మోసం చేసేయగలరని.. తాను అలాకాదని.. బాగా తెలివైనదానినని.. ఇంట్లో తనదే పెద్దరికం ఉండాలని కోరుకునే తత్త్వం.. అందుకే నారాయణ చూద్దము లేవే అనగానే.. ఏటి చూసేది... అప్పుడెప్పుడో అనుకున్నాం కదాని ఇప్పుడు చేసేస్తామా... మంచీచెడ్డా ఉండవా అంది.. నేను దిగితే సీన్ మొత్తం మారిపోద్ది అనే కమాండింగ్ ఆమె మాటల్లో స్పష్టమైంది. ఉంటాయుంటాయి ఎందుకుండవు వదినా.. మూడు లక్షల కట్నం.. హీరోహోండా ఇస్తాం.. పిల్లాడికి ఒక తులం చైను.. ఇక పెళ్లయ్యాక సారిసీరెలు ఉండనే ఉంటాయి కదా అంది నాగమణి.. ఉంటాయమ్మా ఎందుకుండవు.. అందరికీ ఉంటాయి.. ఎవరిళ్లలో లేవు అంటూ రాజ్యం మళ్లీ లైన్లోకి వచ్చింది. అమ్మ వాలకం చూస్తుంటే రామలక్ష్మిని మిస్సైపోతానేమోనని ఓ వైపు నాగరాజు కళ్లలో చిన్న భయం.. మా అన్న కూతురు మంగ కూడా బీటెక్ చేసింది.. కట్నం ఐదు లక్షలు ఇస్తామని మా వదిన మాట్లాడింది అంటూ రాజ్యం తమవాడి మార్కెట్ రేటు బయటపెట్టింది.. అమ్మో.. అంత ఇవ్వకపోతే రామలక్ష్మి దక్కదేమో అని నాగరాజులో ఆందోళన... ఈలోపే రామలక్ష్మి వచ్చి.. పోన్లేయమ్మా.. నా జీతం డబ్బులున్నాయి కదా.. కొంత సర్దుబాటు చేద్దాం అని చెప్పడంతో నాగరాజును మిస్ చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసింది. అమ్మనీ గుంటా తెలివైందే... అని మనసులో అనుకుంటూనే కళ్లతోనే రామలక్ష్మి కాళ్లకు దండం పెట్టేశాడు.. సరే.. అయితే.. రేపెల్లుండి మంచిరోజు చూసి మాటనుకుందాం అన్నది రాజ్యం ధీమాగా.. మరి పండక్కి కొత్తకోడలికి కోక గట్రా పెడితే .. అంది నాగమణి కాస్త సందేహిస్తూ.. ఆ చూద్దాంలే అని రాజ్యం అంటుండగానే అమ్మా నేను నీకు తెచ్చిన మూడు చీరల్లో ఆ అరిటాకు రంగు చీర ఇచ్చేయ్... రాముకు బాగుంటుంది అనేశాడు ఆగలేక నాగరాజు.. బయటకు చెప్పకపోయినా రామలక్ష్మి మనసులోనే నాగరాజును వాటేసుకుని సిగ్గులమొగ్గయింది.. అమ్మనీ గుంటడా అప్పుడే ఇలా తయారయ్యావా అంది రాజ్యం.. పోన్లే వదినా .. పిల్లలకు ఇష్టమే కదా.. మరెందుకు మాటలూ అనేసింది.. నాగమణి..
మొత్తానికి పండక్కి వచ్చిన రెండు కుటుంబాలు ఇలా సంబంధం కుదుర్చుకున్నాయి.. ఇలాంటి సంఘటనలు.. సన్నివేశాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. వాటన్నిటికీ సంక్రాంతి ఒక వేదిక.. మధ్యతరగతి వాళ్లకు సంక్రాంతి ఒక వేడుక.
రామలక్ష్మి సిగ్గుపడింది


