పెళ్లికి వచ్చి మృత్యుఒడిలోకి..
పార్వతీపురం రూరల్: స్నేహితుడి అక్క వివాహంలో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి సరదాగా వచ్చారు. స్నానం కోసం వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ విషాదకర ఘటనతో పెళ్లి ఇంట విషాదం అలముకుంది. పార్వతీపురం మండలం పులిగుమ్మిలోని సాకిగెడ్డ తీరం కన్నీటి సంద్రంగా మారింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి గ్రామంలో బుధవారం జరగనున్న వివాహ వేడుకకు ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన 20 మంది బంధువులు పెళ్లి కుమార్తె తరఫున సోమవారం పులిగుమ్మి గ్రామానికి చేరుకు న్నారు. సాయంత్రం గ్రామ శివారులో ఉన్న సాకి గెడ్డలో స్నానం చేసేందుకు వెళ్లిన ఐదుగురులో తొలుత గెడ్డలో దిగిన నగిరెడ్డి రాము (16) బొత్స ఈశ్వర్ కుమార్(16) అనే ఇద్దరు యువకులు ఈతరాక నీటిలో మునిగి మృతి చెందారు. వెంటనే మిగిలిన ముగ్గురు స్నేహితులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గెడ్డలో యువకులను వెతికి బయటకు తీశారు. అప్పటికే మృతి చెందడంతో పార్వతీపురం గ్రామీణ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వారే..
మృతి చెందిన ఇద్దరు యువకులలో నాగిరెడ్డి రాము విజయనగరం జిల్లా రేగిడి మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన వాడుకాగా, మరో మృతుడు బొత్స ఈశ్వర్‌కుమార్ బలిజిపేట మండలం సుభద్ర గ్రామం. 20 సంవత్సరాల కిందట మృతుల తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతానికి వెళ్లిపోయారు. మృతి చెందిన ఇద్దరూ ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. అందివచ్చిన కుమారులు అందని లోకాలకు వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరుపెట్టారు. ఘటనా స్థలాన్ని పార్వతీపురం రూరల్ పోలీసులు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
పెళ్లికి వచ్చి మృత్యుఒడిలోకి..
పెళ్లికి వచ్చి మృత్యుఒడిలోకి..


