పుర సమస్యలు పక్కనపెట్టి.. ఏలికల మాటే వేదమనీ!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మున్సిపల్ అధికారులు.. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో ఎన్నికై న పాలకవర్గాన్ని పక్కనపెట్టి, కూటమి ప్రభుత్వానికి వీర విధేయులుగా పని చేస్తున్నారు. స్థానిక సమస్యలను గాలికొదిలి.. ‘రాజకీయాలు’ చేసుకుంటున్నారు. ప్రధానంగా మున్సిపల్ కమిషనర్ తీరుపై పాలకవర్గ ప్రతినిధులే ఆరోపణలు గుప్పించడం గమనార్హం.
30 వార్డులున్న పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో గత స్థానిక ఎన్నికల్లో 22 వార్డులను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన విషయం విదితమే. అనంతరం కాలంలో ‘అధికారం’ కోసం పలువురు కౌన్సిలర్లు కూటమి చెంతకు చేరారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠంపై కన్నేసిన కూటమి నేతలు కొద్దిరోజుల కిందట సంయుక్త కలెక్టర్ శోభికకు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ఆ నోటీసు కాస్త రివర్స్ అయి తుస్సుమనడంతో భంగపాటుకు గురయ్యారు. ఇప్పుడు అధికారులను అడ్డం పెట్టుకుని మరో వ్యూహానికి పదును పెడుతున్నారన్న గుసగుసలు పట్టణ వాసుల్లో వినిపిస్తున్నాయి.
పాలకవర్గాన్ని రద్దు చేసే యోచన?
మున్సిపాలిటీలో కొన్ని నెలలుగా పాలకవర్గ సమావేశాలు నిర్వహించడం లేదు. సమావేశాలు జరిపితేనే.. ప్రజాసమస్యలపై చర్చించి, పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. గత డిసెంబర్ వరకు సమావేశాలు సక్రమంగా సాగినా.. ఆ తర్వాత ఒక్కసారి కూడా చేపట్టిన దాఖలాలు లేవు. గత జనవరి 29న ఎన్నికల కోడ్ తర్వాత పూర్తిగా విస్మరించారు. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. సమావేశాల నిర్వహణకు ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. ఆ విషయాన్నీ పక్కనపెట్టి, మున్సిపల్ అధికారులు పూర్తిగా అధికార కూటమి కనుసన్నల్లో నడుస్తూ.. పాలకవర్గ భేటీకి సమయం ఇవ్వకుండా కాల యాపన చేస్తూ వస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈలోగా కొంతమంది సభ్యులు కూటమి పార్టీల కండువా కప్పుకున్నారు. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లతోపాటు.. మిగిలిన వైఎస్సార్‌సీపీ సభ్యులు పాలకవర్గ సమావేశాలు నిర్వహించాలని చాలా రోజులుగా మున్సిపల్ కమిషనర్‌ను కోరుతున్నారు. ఆయన నుంచి ఎటువంటి స్పందనా రావడం లేదు. దీంతో ఇటీవలే చైర్‌పర్సన్ మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు సరికదా.. సాధారణ, బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నా కమిషనర్ వినడం లేదని వాపోయారు.
విధి నిర్వహణలో భాగంగా పాలకవర్గ సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉంది. అధికార పార్టీ ఆదేశాలు లేకపోవడం వల్లే ఆయన ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవిశ్వాసం డ్రామాలో ఎలాగో నెగ్గలేకపోయిన కూటమి నాయకులు.. పాలకవర్గాన్ని రద్దు చేసే యోచనలో అధికారులను అడ్డం పెట్టుకుని, ఈ విధమైన ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు చెబుతున్నారు. నెలల తరబడి సమావేశాలు నిర్వహించకపోతే పాలకవర్గం రద్దయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.
సమస్యలను పక్కనపెట్టి..
ప్రజాసమస్యలను పక్కనపెట్టి, పార్వతీపురం మున్సిపల్ అధికారులు పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల ఆర్థికపరమైన అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. దాదాపు 62 వేల జనాభా ఉన్న పార్వతీపురం మున్సిపాలిటీలో వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకుంది. కొన్ని ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకోసారి కూడా కుళాయిల నుంచి నీరు సరఫరాకావడం కష్టంగా మారుతోంది. రోజుకు 8.5 ఎంఎల్‌డీలు అవసరం కాగా.. ప్రస్తుతం 5.5 ఎంఎల్‌డీలు సరఫరా అవుతోంది. అధ్వాన పారిశుద్ధ్య స్థితి కారణంగా ఏ వీధి చూసినా డంపింగ్‌యార్డులా దర్శనమిస్తోంది. పట్టణంతోపాటు, సమీప ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్ని చెరువులు వ్యర్థాలతో నిండిపోతున్నాయి. డంపింగ్‌యార్డు తరలింపు సమస్య అలానే ఉండిపోయింది. అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదు. పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ.. ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు చూపడం లేదు. కేవలం కూటమి నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ఏ సమస్యౖపైనెనా చర్చించి, పరిష్కరించాలన్నా పాలకవర్గం ఆమోదం ఉండాలి. అందుకే వైఎస్సార్‌సీపీ సభ్యులు సాధారణ, బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నా.. మున్సిపల్ యంత్రాంగం నుంచి సహకారం కొరవడుతోంది. ఆ ప్రభావం పుర ప్రజలపై పడుతోంది.
అధికార పార్టీకి తొత్తులుగా మున్సిపల్ అధికారులు!
పాలకవర్గాన్ని విస్మరిస్తున్న వైనం
ప్రజా సమస్యలు గాలికి..
సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన
పుర సమస్యలు పక్కనపెట్టి.. ఏలికల మాటే వేదమనీ!


