కాటేసిన ఖరీఫ్‌ | - | Sakshi
Sakshi News home page

కాటేసిన ఖరీఫ్‌

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

కాటేసిన ఖరీఫ్‌ కరువు మండలాల జాబితాపై ఆగ్రహం అప్పులపాలై రైతు ఆత్మహత్య ఇకనైనా హామీ నెరవేర్చాలి కరోనా సమయంలోనూ సేవలు చేశాం

న్యూస్‌రీల్‌

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 41 మండలాల గుర్తింపు టీడీపీ ప్రభుత్వ ప్రకటనపై రైతులు, రైతు సంఘాలు అసంతృప్తి

రైతులను కరుణించని వరుణుడు తోడైన చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఏడాది 33.5 శాతం లోటు వర్షపాతం జిల్లాలో 66 శాతం పంటల సాగు

శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
ఖరీఫ్‌ ఆరంభం నుంచి మేఘాల దోబూచులాటలు .. అడపాదడపా రెండు ఉరుములు.. మూడు మెరుపులు .. ఆపై ఎప్పుడో ఒకసారి నాలుగు చినుకులు.. పగలంతా భానుడి భగభగలు.. ఖరీఫ్‌ సీజనంతా కనిపించిన వాతావరణమిది. ‘ఎల్‌నినో’ తో వర్షాభావం .. ‘ఎల్లోనినో’తో తీవ్ర నిర్లక్ష్యం .. వెరసి ఖరీఫ్‌ పంటలు సాగుకాక పుడమి తల్లి బోసిపోయింది. రైతులను కరువు ముంగిట వదిలేసి ఖరీఫ్‌ ముగిసిపోతోంది. దీంతో పల్నాడు జిల్లా అంతటా కరువు విలయతాండవం చేస్తోంది. సాగుకు పెట్టిన పెట్టుబడులు తీరేమార్గం కనిపించక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వర్షాభావ పరిస్థితులు, పంటల సాగు తగ్గుదల, దిగుబడులపై ప్రభావం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ అన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించకపోవడంపై రైతులు, వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం గుంటూరు జిల్లాలో 8, పల్నాడు జిల్లాలో 18, బాపట్ల జిల్లాలో 15 మండలాలను కరువు మండలాలుగా గుర్తించారు. మొత్తం 66 మండలాలు ఉండగా, 41 మండలాలను మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన 25 మండలాల్లో కరువు లేదంట. కానీ అక్కడా వర్షాభావం, సాగునీటి కొరత, పంటల నష్టాలు ఉన్నాయని రైతులు, రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పలు ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో సాగు జరగలేదు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాగు చేసిన పంటలకు కూడా వర్షాల కొరత, అధిక ఉష్ణోగ్రతలు, నీటి సమస్యలు ఎదురయ్యాయని రైతులు చెబుతున్నారు.

ప్రయోజనాలపై ప్రభావం..

కరువు మండలంగా అధికారికంగా గుర్తింపు లభిస్తే రైతులకు ఉపశమన చర్యలు, పంట నష్టం అంచనాలు, రాయితీలు తదితర ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది. అలా చేర్చకపోతే నష్టపోతామని ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మండలాల గుర్తింపులో గణాంకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా పరిశీలించాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నాయి. వర్షపాతం, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, నీటి లభ్యత, దిగుబడులపై ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అర్హత ఉన్న ప్రాంతాలను కరువు మండలాల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. మూడు జిల్లాల్లోనూ మరోసారి సమగ్రంగా సమీక్షించి మిగతా వాటికీ కరువు మండలాలుగా గుర్తించాలని కోరుతున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు కత్తుల బాలకోటయ్య. ఇతనిది పెదకూరపాడు మండలం తమ్మవరం గ్రామం. ఏటా ఐదు ఎకరాలు మెట్ట భూమిని కౌలుకు తీసుకొని మూడు ఎకరాలు పత్తి, రెండు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవక, టీడీపీ ప్రభుత్వం నుంచి సరైన సూచనలు లేక పెట్టిన పెట్టుబడులు వచ్చే మార్గం కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. రూ. 11 లక్షల వరకు అప్పులయ్యాయి. తీర్చే మార్గం కనిపించక గత నెల 27న బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన భార్య, కుమారుడు, కుమార్తె దిక్కులేనివారుగా మిగిలారు.

సత్తెనపల్లి: కాలం కన్నెర్ర చేసింది. కరువు కోరలు చాచి కర్షకుడి బతుకును ఛిద్రం చేసింది. జిల్లాలో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, కంది, తదితర పంటలు సాగు చేస్తారు. జిల్లాలో సాధారణ సాగు 2,08,560 హెక్టార్లు కాగా... ఇప్పటివరకు 1,48,021 హెక్టార్లలో (66 శాతం మాత్రమే) వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వాన జాడ లేక సాగర్‌ కుడి కాలువ నుంచి సాగునీరు విడుదల కాలేదు. వర్షాధారం కింద వేసిన పంటలు పూర్తిగా ఎండే దశకు చేరుతున్న క్రమంలో ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు రోజులపాటు ముసురుతో కూడిన వర్షం కురిసింది. నాలుగు నెలలుగా వర్షాలు లేక పత్తి పైరు గిడస బారి పోయింది. ఎకరా పత్తి సాగుకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పత్తి ఎకరానికి క్వింటా కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పంట చేతికి రాకమునుపే తెగుళ్లు ఆవహించి నష్టం వాటిల్లుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఫలితంగా బోర్లకు కూడా నీరు సరిగ్గా అందడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

భారీగా పడిపోయిన వర్షపాతం

జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణ వర్షపాతం 455.90 మిల్లీమీటర్లు కాగా 303.40 గా నమోదైంది. 33.50 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు చెబుతున్నారు. 120 రోజుల కాలంలో అడపా దడపా 29 రోజులే వర్షం కురిసింది.

కరువు మండలాలు ఇవీ..

నరసరావుపేట, నాదెండ్ల, గురజాల, బొల్లాపల్లి, దాచేపల్లి, రెంటచింతల, కారంపూడి, పిడుగురాళ్ల, వెల్దుర్తి, సత్తెనపల్లి, పెదకూరపాడు, నూజెండ్ల, దుర్గి, శావల్యాపురం, వినుకొండ, ఈపూరు, చిలకలూరిపేట, యడ్లపాడు మండలాల్లో తీవ్రంగా కరువు.. ముప్పాళ్ళ, నకరికల్లు, రాజుపాలెం, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి, మాచర్ల, రొంపిచర్ల, మాచవరం మండలాల్లో మధ్యస్థంగా కరువు ఉందని సర్కార్‌ పేర్కొంది.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. నేడు వ్యవస్థనే లేకుండా చేశారు.

సీన్‌ కట్‌ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement