పరిశుభ్రత సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

జిల్లాలోని 69 మందికి స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర అవార్డులు ప్రదానం పాల్గొన్న కలెక్టర్‌, అదనపు ఎస్పీ, ఎమ్మెల్యే

నరసరావుపేట: పరిశుభ్రత అనేది ప్రభుత్వ అధికారుల విధి మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అన్నారు. దేశంలోనే స్వచ్ఛతకు మారుపేరైన ఇండోర్‌ నగరంలా మన జిల్లాలోని ప్రతి ప్రాంతం పరిశుభ్రంగా మారాలంటే ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్థానిక భువనచంద్ర టౌన్‌హాలులో స్వచ్ఛాంధ్రలో ప్రతిభ చూపిన అధికారులు, కార్మికులకు స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ అదనపు జిల్లా ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి, ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబులతో కలిసి గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో 13 శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి అవసరమైన అన్ని రకాల వాహనాలు, పరికరాలను ఇప్పటికే సమకూర్చామన్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అవార్డు దక్కించుకున్న చిలకలూరిపేట మున్సిపాలిటీ స్ఫూర్తితో మిగతా అన్ని విభాగాలు పనిచేయాలని కోరారు. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా సమాజంలో మనం చూడాలనుకునే మార్పు మన ఇంటి నుంచే మొదలుకావాలని, మనమంతా కలిసికట్టుగా కృషి చేసి, పల్నాడును స్వచ్ఛమైన, సురక్షితమైన ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను సబికులతో చేయించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ నరసరావుపేట మున్సిపల్‌ అధికారులు, కార్మికులు, శానిటరీ వర్కర్స్‌ రాత్రింబవళ్లు కష్టపడి ఎన్నో ఏళ్లుగా ఈ పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, మున్సిపల్‌ అధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతిరోజూ ఒక గంట స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేయగలిగితే పట్టణాలు పల్లెలు పరిశుభ్రంగా రూపొందటానికి వీలవుతుందన్నారు. అనంతరం 69 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, డీఆర్‌ఓ కె.అద్దయ్య, ఆర్డీవో బాలకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్యకీర్తన, డీపీఓ నాగేశ్వరనాయక్‌, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మున్సిపల్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement