కాజీపేటరూరల్: కాజీపేట జీఆర్‌పీ పోలీసులు శుక్రవా రం తప్పిపోయిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నరసరావుపేట కు చెందిన మతిస్థిమితం లేని 50 ఏళ్ల బొల్లపల్లి సుకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చర్చీకి వచ్చాడు. వారి కళ్లుగప్పి మంచిర్యాల స్టేషన్‌లో బీదర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. కుటుంబసభ్యులు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాజీపేట జీఆర్పీ ఎస్‌ఐ అభినవ్ సూచనల మేరకు హెడ్‌కానిస్టేబుల్ ఓంకార్, అశోక్, కోటేష్ అప్రమత్తమై కాజీపేటకు చేరుకున్న రైలులో తనిఖీ చేసి సుకుమార్‌ను గుర్తించి కిందికి దింపారు. కుటుంబసభ్యులు రాగా వారికి అప్పగించారు. కుటుంబసభ్యులు జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


