చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

నరసరావుపేట రూరల్‌: సంచలనం సృష్టించిన యడ్లపాడు చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్టు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి తెలిపారు. వీరి వద్ద నుంచి 362 గ్రాముల బంగారం, 5.9 కిలోల వెండి, రూ.1.02 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. యడ్లపాడులో ఈనెల 8న జరిగిన చోరీ కేసులో 401 గ్రా. బంగారం, 5.442 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్టు, ఈ ఆస్తి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇంటి తాళాలు పగులగొట్టి నిందితులు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు ఈనెల 18వ తేదీన వెన్న దుర్గ దినేష్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. అతను ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేయడంతో చోరీలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితులు గుంజి యేసు రాజ, షేక్‌ నాగూర్‌బాషలను అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్నారు. బంగారం కొనుగోలు చేసిన మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన యలమద్ది నాగరాజును కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. నిందితులు నాదెండ్ల మండలం గణపవరంలో రెండు చోరీలు, చిలకలూరిపేట టౌన్‌లో మరోచోట చోరీకి పాల్పడినట్టు విచారణ వెల్లడైనట్టు తెలిపారు. ఈ కేసులో ఏ1 వెన్న దుర్గ దినేష్‌పై గతంలో 12 చోరీ కేసులు ఉన్నాయని, ఏ2 గుంజి యేసు రాజ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలిపారు. డీఎస్పీ ఎం. హనుమంతరావు, చిలకలూరిపేట సీఐ బి.సుబ్బనాయుడు, సీసీఎస్‌ సీఐ ఎంవీ చరణ్‌, యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ, సిబ్బందికి రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement