19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ... 20న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఆయా తేదీల్లో మండలానికి ఒకరు, జెడ్పీకి ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు
వైఎస్ జగన్ పాలనలో ఇద్దరు వైస్ చైర్మన్లు..
సత్తెనపల్లి: జిల్లాలో గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 5న పోలింగ్, 7వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో ఇక మిగిలిన మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), మండల పరిషత్ ఉపాధ్యక్షులు (వైస్ ఎంపీపీ), జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 10న షెడ్యూల్ విడుదల చేసింది. 19న ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు... 20న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకునేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో పలు సూచనలు చేసింది. ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కొన్ని గంటల ముందే మండలాల్లో ఒకరు, జిల్లా పరిషత్‌లో ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది.
ఎంపీపీ ఎన్నికకు...
మండల పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునేందుకు ముందుగా 14వ తేదీలోపు ఆయా మండలాల్లో ఎన్నికై న ఎంపీటీసీ సభ్యులందరికీ 19న ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికకు ముందుగా అదే రోజు ఉదయం 10 గంటలలోపు ఆయా మండలాల్లో కోఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునేందుకు నామినేషన్లను స్వీకరించాలి. మధ్యాహ్నం 12 గంటలలోపు పరిశీలించి, చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాలను ప్రచురించాలి. మధ్యాహ్నం ఒంటి గంటలోపు (కోఆప్షన్ సభ్యుడి ఎన్నికకు పోటీ ఉంటే) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే కోఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక పూర్తయిన అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు.
జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు...
జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా 14వ తేదీలోగా జెడ్పీటీసీలుగా ఎన్నికై న వారందరికీ 20వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. అదే రోజున ఉదయం 10 గంటలలోపు ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు నామినేషన్లను స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పరిశీలన పూర్తి చేసి, చెల్లుబాటయ్యే నామినేషన్ల తుది జాబితాలను ప్రచురిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలి. సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను సభ్యులు ఎన్నుకుంటారు.
కోఆప్షన్ సభ్యుల అర్హతలివే..
మండల పరిషత్, జిల్లా పరిషత్ పరిధిలోని ఆయా మండలం లేదా జిల్లాలో ఓటరుగా నమోదై, కనీసం 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. మతపరంగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లా పరిషత్‌కు ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించారు. అప్పట్లో ఈ విధానం అమల్లో ఉన్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారు. అలాగే, మండలాల్లో కూడా ఒక ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలు కొనసాగారు. ప్రస్తుతం మండల, జిల్లా పరిషత్‌లలో వైస్ ఎంపీపీ, వైస్ చైర్మన్ పదవుల సంఖ్యను ఒక్కొక్కరికే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వైస్ ఎంపీపీలుగా 28 మందికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఒకరికి అవకాశం లభించగా, మరో 29 మందికి అవకాశాలు చేజారాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి జిల్లా పరిషత్ విడిపోవడంతో పల్నాడు జిల్లా పరిషత్ తొలి చైర్మన్‌గా జనరల్ మహిళకు అవకాశం దక్కింది.


