నష్టం అంచనాలోనూ వంచన! | - | Sakshi
Sakshi News home page

నష్టం అంచనాలోనూ వంచన!

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

నష్టం అంచనాలోనూ వంచన! నిండా ముంచేసిన తుపాను

పల్నాడులోనూ ఇదే తీరు...

భారీగా తగ్గించి చూపుతున్న చంద్రబాబు సర్కార్‌ అర్థంపర్థం లేని నిబంధనలతో అన్నదాతలకు తీరని అన్యాయం

ఈ రైతు పేరు శెట్టి శ్రీహరిరావు. వంగిపురం గ్రామం. సొంతంగా ఉన్న రెండున్నర ఎకరాలతోపాటు అర ఎకరా కౌలుకు తీసుకుని వరి వేశారు. మరో ఎకరంలో మొక్కజొన్న సాగు చేశారు. వరికి ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి అయింది. కౌలు చూస్తే రూ.20 వేలు – రూ.30 వేల వరకు అయింది. ఇంతలో పంటను తుపాను ముంచేసింది. దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు ఎకరాకు 20 బస్తాల దిగుబడి కూడా అనుమానమే. పెట్టుబడులకే సుమారు రూ.2.50 లక్షలు – రూ.3 లక్షల వరకు ఖర్చయింది. అప్పులకు వడ్డీలు కట్టాల్సి ఉంది. ప్రభుత్వం నష్టం అంచనాలు తగ్గించడంపై ఆందోళన చెందుతున్నారు. కూటమి సర్కార్‌ తీరుతో పరిహారం ఎంతవరకు అందుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఓ వైపు ఎల్‌నినో, మరోవైపు వరుస తుపానులు అన్నదాతలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. వారిని ఆదుకోకుండా ఇంకోవైపు చంద్రబాబు సర్కారు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నేలకొరిగిన వరి పొలాలను, దెబ్బతిన్న పత్తి, మినుము పంటలను తలచుకుని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట చేతికొచ్చే దశలో వారికి తీరని నష్టం వాటిల్లింది. ఇక పత్తి కాయ, తీత దశలో ఉంది. కాయల్లోకి వర్షపు నీరు చేరడంతో రంగు మారే ప్రమాదం ఉంది. తీత దశలో ఉన్న పత్తి రంగు మారి ఎందుకూ పనికిరాకుండా పోయింది. మినుము పంట నీట మునిగి నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే తక్కువ నష్టం అంటూ సాధ్యమైనంత మంది రైతులను బాధితుల జాబితా నుంచి తొలగించింది.

భారీగా మారిన లెక్కలు

గుంటూరు జిల్లాలో మురసు తుపాను వల్ల 37 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1,300 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ, 14 మండలాల్లో 14,257 మంది రైతులకు సంబంధించి 10,798.14 హెక్టార్లలో వరి, మినుము, పత్తి, కంది తదితర పంటలు, మరో 276 మంది రైతులకు సంబంధించి 194.36 హెక్టార్లలో మిరప, కూరగాయలు, అరటి, బొప్పాయి, పసుపు, పూలు వంటి ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఎన్యుమరేషన్‌లో తేల్చారు. ప్రాథమిక అంచనాలకు, ఎన్యుమరేషన్‌లో నమోదైన లెక్కలకు మధ్య సుమారు 25 వేల హెక్టార్ల మేర తేడా ఉంది. అంటే చాలా ఎక్కువ మందికి నష్టపరిహారం అందే అవకాశమే లేకుండా చేశారు. అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. గుర్తించిన నష్టానికి పరిహారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. వరి, పత్తి పంటలకు ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెడితే, ప్రభుత్వం హెక్టారుకు రూ.25 వేలు, మినుముకు హెక్టారుకు రూ.15 వేలు ఇస్తామని చెబుతోంది. అంటే పెట్టుబడిలో మూడో వంతు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

విత్తు నుంచి పంట వరకు శాపాలే..

కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. గత రెండేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లేదు. మిల్లర్ల మాఫియాకు తలొగ్గి ధాన్యం కొనుగోళ్లు కూడా సరిగా చేయలేదు. దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. కష్టపడి పండించిన పంటలు మురసు తుపాను గాలులకు, భారీ వర్షాలకు కళ్లముందే వర్షార్పణమయ్యాయి. ఇకనైనా అడ్డగోలు నిబంధనల పేరుతో కాకిలెక్కలు వేయకుండా తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నరనరావుపేట రూరల్‌: పల్నాడు జిల్లాలో మురసు తుఫాన్‌ కారణంగా సాధారణ పంటలకు 3,268 హెక్టార్లలో, ఉద్యాన పంటలకు 1,457 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ తుది అంచనాలకు వచ్చే సరికి సాధారణ పంటలు 1,439 హెక్టార్లకు, ఉద్యాన పంటలు 6.04.20 హెక్టార్లకు పరిమితం చేశారు. మొత్తం 3,794 మంది రైతులకు చెందిన 2,043 హెక్టార్లలో రూ.5.47 కోట్ల మేరకు పంట నష్టం సంభవించినట్టు అధికారులు తుది అంచనాలు రూపొందించారు. వరి, పత్తి, మిరప పంటలకు భారీగా నష్టం జరిగినట్టు తేల్చారని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. నకరికల్లు మండలంలో అత్యధికంగా 529.30 హెక్టార్లు, యడ్లపాడు – 371, రాజుపాలెం – 172.80, నాదెండ్ల – 13.17, పెదకూరపాడు – 121.80, చిలకలూరిపేట – 36.50, సత్తెనపల్లి – 19.20, రొంపిచర్ల – 11.10, నరసరావుపేట – 13.90 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. వరి – 758.40, పత్తి – 512.10, కంది – 90.70, జూట్‌ 46.20, మొక్కజొన్న 26.90, మినుము 2.80, సజ్జలు 2 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు వివరించారు. తుఫాన్‌ కారణంగా 1,362 మంది రైతులకు చెందిన 604.20 హెక్టార్లులో పంటలు దెబ్బతినడంతో రూ.2.40 కోట్లు నష్టం జరిగినట్టు ఉద్యాన అధికారి వెంకట్రావు తెలిపారు. మిర్చి, అరటి, బొప్పాయి, నిమ్మ, కూరగాయల పంటలకు అధికంగా నష్టం జరిగినట్టు పేర్కొన్నారు. మిరప 454.426, అరటి 50.251, కూరగాయలు 37.872, బొప్పాయి 33.086, నిమ్మ 12.301, కంద 7.566 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వారికి అడుగడుగునా తీరని అన్యాయం చేస్తోంది. ఇటీవల సంభవించిన మురసు తుపాను పంట నష్టం అంచనాల్లో కోత విధించింది. ప్రాథమిక అంచనాలకు, తుది నష్టానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

తుపాను నష్టం అంచనాల్లో కూటమి ప్రభుత్వం జిమ్మిక్కు

మొంథా పరిహారమేదీ?

గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపానుతో పంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లాలో 3,800 మంది రైతులు 6,062.21 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. దీనికి సంబంధించి రూ.5.75 కోట్ల పరిహారం నేటికీ అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మురసు తుపాను పరిహారం ఎప్పుడు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement