డీఈడీ సీట్లు ఖాళీ | - | Sakshi
Sakshi News home page

డీఈడీ సీట్లు ఖాళీ

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

ఖాళీలున్నా..

చేరేవారే లేరు..

ఫీజు చెల్లింపునకు విద్యార్థుల వెనకడుగు 221 మందికి ఫైనల్‌ ఎలాట్‌మెంట్‌ ఫీజు చెల్లించింది 15 మందే తొలిరోజు వెబ్‌సైట్‌ మొరాయింపు రెండో రోజు సజావుగా కౌన్సెలింగ్‌

యడ్లపాడు: డీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు నిర్వహిస్తున్న రెండో విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థుల స్పందన అంతంతమాత్రంగానే ఉంది. డీఈఈ సెట్‌–2026లో సీట్లు ఎలాట్‌ అయినా.. ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందేందుకు మాత్రం విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 221 మందికి ఫైనల్‌ ఎలాట్‌మెంట్‌ లభించగా.. 15 మంది మాత్రమే ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందారు. డీఈడీ కళాశాలల్లో సీట్లు భారీగా ఖాళీగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ విద్యాశిక్షణ సంస్థ (డైట్‌) కళాశాలలో శనివారం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి, డైట్‌ ప్రిన్సిపాల్‌ పీవీజే రామారావు పర్యవేక్షణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి ధ్రువపత్రాలను పరిశీలించారు.

తొలిరోజు సాంకేతిక సమస్య..

రెండో రోజు ఊరట

రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు తొలిరోజు వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌్‌ ప్రక్రియలో కొంత గందరగోళం నెలకొంది. శనివారం ఆన్‌లైన్‌ సేవలు సజావుగా పనిచేయడంతో ప్రక్రియ వేగం పుంజుకుంది. మొత్తం 221 మంది విద్యార్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరై ఫైనల్‌ ఎలాట్‌మెంట్‌ పొందారు. వారిలో 15 మంది మాత్రమే ఫీజు చెల్లించి ప్రవేశాలు ఖరారు చేసుకున్నారు. సీటు వచ్చినా ఫీజు చెల్లింపునకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది.

బోయపాలెం డైట్‌లోనూ తక్కువే

బోయపాలెం ప్రభుత్వ డైట్‌ కళాశాలలో తెలుగు మాధ్యమంలో 18, ఆంగ్ల మాధ్యమంలో 23, ఉర్దూ మాధ్యమంలో 23 మందికి ఫైనల్‌ ఎలాట్‌మెంట్‌ లభించింది. ఫీజు చెల్లించిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ఆంగ్ల మాధ్యమంలో ఆరుగురు, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఇద్దరేసి చొప్పున మాత్రమే ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందారు.

ప్రైవేటు కళాశాలల్లో మరింత నిరాసక్తత

నరసరావుపేట కేసానపల్లిలోని ఎంఏఎం ప్రైవేటు డీఈడీ కళాశాలలో తెలుగు మాధ్యమానికి 24, ఆంగ్ల మాధ్యమానికి 79 మంది ఫైనల్‌ ఎలాట్‌ అయ్యారు. వీరిలో తెలుగు మాధ్యమంలో ఒక్కరు, ఆంగ్ల మాధ్యమంలో నలుగురు మాత్రమే ఫీజు చెల్లించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలలోని జీనత్‌ డీఈడీ కళాశాలలో తెలుగు మాధ్యమానికి 28, ఆంగ్ల మాధ్యమానికి 26 మందికి సీట్లు ఎలాట్‌ అయ్యాయి. అయితే ఒక్క విద్యార్థి కూడా ఫీజు చెల్లించి ప్రవేశం పొందలేదు.

డీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం విద్యార్థులకు సీట్లు కేటాయించినా.. వాటిని ఖరారు చేసుకునే విషయంలో మాత్రం ఆసక్తి కనిపించకపోవడం విద్యాశాఖ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వ కళాశాలలతో పోలిస్తే ప్రైవేటు కళాశాలల్లో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించింది. ఫీజులు, ఉపాధి అవకాశాలు, ఇతర కోర్సుల వైపు విద్యార్థుల మొగ్గు వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణమా? లేక డీఈడీ కోర్సుపై ఆసక్తి తగ్గుతోందా? అనేది పరిశీలించాల్సిన అంశంగా మారింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌న్‌ ప్రక్రియను డైట్‌ అధ్యాపకుల వెరిఫికేషన్‌ బృందం సభ్యులు డాక్టర్‌ రమేష్‌, కె.పద్మకోటి నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement