గుంటూరు వెస్ట్: ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించని సంస్థలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ రాష్ట్ర జీఎస్టీ లక్ష్యాలను సాధించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పనులు పూర్తి చేసిన అనంతరం బిల్లులు అప్‌లోడ్ చేసే సమయంలో జీఎస్టీ వివరాలపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జీఎస్టీ చెల్లించని సంస్థలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని అందుకు తగిన సమాచారంతో శాఖల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. జి.ఎస్.టి జాయింట్ కమిషనర్ గీతా మాధురి మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించని సంస్థల బ్యాంక్ ఖాతాల వివరాలు అందించాలని కోరుతున్నామని చెప్పారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, జిల్లా ఎస్.జి.ఎస్.డబ్ల్యూ అధికారి రామలింగారెడ్డి, నగర పాలక సంస్థ ఈఈ సుందరరామిరెడ్డి, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల నాయుడు పాల్గొన్నారు.
గుంటూరు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ


