సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడి గుర్తింపు కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు
లక్ష్మీపురం: ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారి నివాసంలో బంగారం, వెండి వస్తువులు చోరీ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని నవభారత్‌నగర్ 1/4వ లైన్‌కు చెందిన కావూరి గురుమణీదీప్ గణేష్ అనే వ్యక్తి కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీన కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి 15వ తేదీన తిరిగి వచ్చారు. 19వ తేదీన బీరువా తెరిచి చూసే సరికి దాదాపు రూ.45 లక్షల విలువ చేసే బంగారం, వెండి వస్తువులు, రూ. లక్ష నగదు కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. గణేష్‌కు బంధువు అయిన గొట్టిపాటి ఆంజనేయులు ఇదే నివాసంలో ఐదు సంవత్సరాలపాటు నివాసం ఉన్నాడు. ఆ సమయంలో ఇంటికి రెండు తాళాలు ఉండేవి. ఒకటి గణేష్, మరొకటి అతని వద్ద ఉంది. ఎనిమిది నెలల క్రితం ఇంటి నుంచి ఆంజనేయులు వెళ్లిపోయాడు. ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ నెల 13వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఆంజనేయులు తన వద్ద ఉన్న రెండో తాళంతో ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలో ఉన్న నగలు, వెండి వస్తువులను చోరీ చేసినట్లు గుర్తించారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొట్టిపాటి ఆంజనేయులు, అతనికి సహకరించిన తల్లిదండ్రులు ఆనంద్‌బాబు, రంగమ్మలపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.


