క్షేత్రస్థాయిలో కనిపించని చర్యలు అధ్వాన పారిశుద్ధ్యంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న జ్వర బాధితులు ఆస్పత్రుల్లో ఎక్కువైన రోగుల రద్దీ ప్లేట్‌లెట్స్ పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దందా చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ...
డెంగీ!
వర్షాకాలం మొదలై నెల రోజులు కూడా కాకముందే పల్నాడు జిల్లాలో సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒకరు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం ప్రతి ఏడాది జూలై నెలను యాంటీ డెంగీ మాసంగా ప్రకటించి ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి ప్రభావం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నరసరావుపేట టౌన్: పట్టణాలు, గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం, నిల్వ నీరు, దోమల బెడద కారణంగా డెంగీతోపాటు వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నరసరావుపేట ఏరియా వైద్యశాలకు గతంలో రోజుకు సుమారు 600 మంది వరకు ఓపీకి వస్తుండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 750 దాటింది. ఉదయం నుంచే ఓపీ కౌంటర్లు, వైద్యుల గదుల వద్ద రోగులు బారులు తీరుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు అధికంగా జ్వరాలతో ఆస్పత్రులకు వస్తుండటంతో వైద్యసిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి.
దోమల కేంద్రాలుగా కాలనీలు
నరసరావుపేట పట్టణంతోపాటు జిల్లాలోని అనేక గ్రామాల్లో డ్రెయినేజీలు నెలల తరబడి శుభ్రం చేయకపోవడం, చెత్త పేరుకుపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగాయి. రంగు మారిన మురుగు నీరు కాలువల్లో నిల్వ ఉండటం, ఖాళీ స్థలాల్లో చెత్త, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ పాత్రల్లో నీరు నిల్వ ఉండటం దోమలకు అనుకూల వాతావరణంగా మారింది. ఫలితంగా డెంగీ వ్యాప్తి పెరిగింది.
నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదమే
మరోవైపు డెంగీ సాధారణ జ్వరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, శరీరంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్‌లెట్స్ తగ్గి రక్తస్రావం వంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ప్లేట్‌లెట్స్ పేరుతో దోపిడీ
డెంగీ పేరు వినగానే ప్రజలు భయపడుతున్న పరిస్థితిని కొందరు ప్రైవేటు ఆస్పత్రులు అవకాశంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్లేట్‌లెట్స్ తగ్గాయని చెబుతూ అవసరం లేని రక్తపరీక్షలు, స్కానింగ్‌లు, ఖరీదైన చికిత్సలు సూచించి రూ.వేల నుంచి రూ.లక్షల వరకు బిల్లులు వేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం ప్రతి డెంగీ రోగికి ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉండదు. రోగి పరిస్థితిని బట్టి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రభుత్వ వైద్యుల సలహాలు పాటించాలని సూచిస్తున్నారు.
కాగితాలకే పరిమితం
ప్రతి ఏడాది జూలైలో డెంగీ నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు, ఇంటింటా తనిఖీలు, యాంటీ లార్వా స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రజలు అంటున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగీకి కారణమయ్యే దోమ పగటి వేళల్లో కుడుతుంది. నీటి డ్రమ్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, కూలర్లు, ఫ్రిజ్ ట్రేలు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ప్లాస్టిక్ కప్పులు వంటి చోట్ల నిల్వ ఉండే స్వచ్ఛమైన నీటిలోనే ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండనివ్వకూడదు. వారానికి ఒకసారి నీటి నిల్వ పాత్రలను పూర్తిగా శుభ్రం చేయాలి. పూర్తిగా చేతులను కప్పేలాదుస్తులు ధరించాలి. దోమతెరలు, దోమల నివారణ పరికరాలు వినియోగించాలి. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచన లేకుండా ప్లేట్‌లెట్స్ ఎక్కించుకోవద్దు. అధికారుల అప్రమత్తతే రక్షణ డెంగీని అరికట్టాలంటే యాంటీ డెంగీ మాసం పేరుతో ప్రచారం చేయడం మాత్రమే సరిపోదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాలనీల్లో నిల్వ నీటిని తొలగించడం, డ్రెయినేజీలను శుభ్రం చేయడం, ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్‌ను విస్తృతంగా నిర్వహించడం అవసరమని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో పల్నాడు జిల్లాలో డెంగీతో పాటు ఇతర సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


