వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ వెన్నుపోటు పార్టీ నేతల కుట్ర మేరకు అరెస్టు చేశారని ఆరోపణ
దుర్మార్గపు పాలనకు పరాకాష్ఠ ..
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్ అరెస్టు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు పాలనలో భాగంగానే జరిగిందని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నాగార్జునయాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు, లోకేష్‌లు అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకే తెలంగాణలోని తెలుగు–కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల క్రితం సాక్షి టీవీలో కేఎ్‌స్‌ఆర్ లెవ్‌షోలో పాల్గొన్న యాదవ్ మాట్లాడిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని స్విగ్గీ డెలివరీ బాయ్ అని కామెంట్ చేసిన వీడియోను ఈ నెల 10వ తేదీన తెలంగాణకు చెందిన వ్యక్తి ఫేస్ బుక్‌లో చూసి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయటం కుట్రలో భాగమే అన్నారు. ఆ రాష్ట్ర పోలీసులు మన రాష్ట్రంలోని పోలీసుశాఖకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న యాదవ్‌ను బలవంతంగా తీసుకెళ్లారన్నారు. అడ్డువచ్చిన ఆయన భార్యను కూడా జీపులో ఎక్కించుకొని కొంతదూరం వెళ్లగానే రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోవటం దారుణమని అన్నారు. వాస్తవానికి ఇటువంటి కేసుల్లో 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టులు అనేకమార్లు చెప్పినా ఆంధ్ర, తెలంగాణ పాలకులు అమలు చేయట్లేదన్నారు. యాదవ్‌ను తీసుకెళ్లిన వెంటనే గుంటూరు ఎస్పీని వైఎస్సార్‌సీపీ నాయకులు కలువగా తనకు కూడా ఆ విషయం తెలియదని వ్యాఖ్యానించి. ఆ తర్వాత ఆయన వివరాలు తెలుసుకోవడం ఆధారంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకులను ఇప్పుడు అరెస్టుచేసిన పోలీసులు.. వైఎస్ జగన్ సతీమణి ఫొటోలను ఐటీడీపీ వ్యక్తులు మార్ఫింగ్ చేసి పెట్టిన తప్పుడు పోస్టులపై మాత్రం స్పందించట్లేదన్నారు. రేవంత్‌రెడ్డి రోజూ అక్కడి ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడే మాటలు ఆయన నైజాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఏమాత్రం మాట్లాడని నాగార్జున యాదవ్‌పై ఇప్పటికే రాష్ట్రంలో 12 అక్రమ కేసులు పెడితే కోర్టు నుంచి యాంటిస్‌పేటరీ బెయిల్ తీసుకొని ఉన్నారన్నారు. పోలీసులు హెబియస్ కార్పస్ పిటిషన్లపై కూడా స్పందించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఇటువంటి దౌర్జన్యాలు, అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడబోరని, నాగార్జున యాదవ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, యువజన విభాగ జిల్లా ఉపాధ్యక్షుడు నాలి వెంకటరావుయాదవ్ మాట్లాడుతూ నాగార్జున యాదవ్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు. బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోగుల మనోహర యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం నాయీ, పట్టణ అధ్యక్షుడు మర్రిపూడి రాంబాబు, జిల్లా వాలంటరీ విభాగ జిల్లా కార్యదర్శి నక్క వెంకటకోటేశ్వరరావు పాల్గొన్నారు.


