నరసరావుపేట: టీడీపీ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదనే విషయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు తెలుసని, చర్చకు వస్తే దీంతోపాటు అవినీతి బయట పడుతుందనే భయంతో పోలీసులను తమపైకి ఉసిగొలిపి చర్చను అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దీనిపై పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తాను చర్చకు సిద్ధం కావటంతో టీడీపీ నాయకులు పోలీసులను ఉసిగొలిపి హౌస్ అరెస్ట్ చేయించారని అన్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి పోలీసులు తనను నిర్బంధంలో ఉంచారన్నారు. తమ హయాంలో నియోజకవర్గంలో రూ.2,467 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. చర్చకు ఎమ్మెల్యే మాత్రమే రావాలని స్పష్టం చేశారు. చర్చకు వచ్చే క్రమంలో జరిగిన తోపులాటలో తన చొక్కాకు రక్తం మరకలు కూడా అయ్యాయని చూపించారు. అంతగా భయపడే వారికి చర్చ ఎందుకని ఎద్దేవా చేశారు. ఎస్పీ ఆఫీసులో బాత్రూంలో కూర్చున్నట్టుగా శుభ్రంగా పోయి బాత్రూంలో కూర్చోవాలని సలహా ఇచ్చారు. అధికారులు ఎవరూ తన మాట వినడం లేదని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పాడం చూస్తే ఇక ఆయనేమి పరిపాలన చేస్తారని నిలదీశారు. ఎప్పుడు చర్చకు పిలిచినా తాను సిద్ధంగా ఉన్నానని, మీడియా ముఖంగానైనా చర్చిద్దామని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చి శివకోటి పాల్గొన్నారు.
మీడియాతో డాక్టర్ గోపిరెడ్డి


