రెండేళ్ల వంచనపై నిరసన గర్జన | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల వంచనపై నిరసన గర్జన

Jun 5 2026 4:23 AM | Updated on Jun 5 2026 4:23 AM

రెండేళ్ల వంచనపై నిరసన గర్జన

జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, మండలాల్లో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ప్రదర్శనలు టీడీపీ మేనిఫెస్టోలో హామీలు అమలు చేయకపోవడంపై నేతల ఆగ్రహం హాజరైన పార్టీ సమన్వయకర్తలు, పరిశీలకులు, ముఖ్య నేతలు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు

సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచన చేస్తుండటంపై వైఎస్సార్‌సీపీ గర్జించింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అన్ని మండల కేంద్రాలు, పట్టణాలలో నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాలను ఎండగట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గాల వారీగా ఇలా...

నరసరావుపేటలో...

తెలుగుదేశం పార్టీని ఇక నుంచి వెన్నుపోటు పార్టీగా పిలవాలని జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రొంపిచర్లలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లోల చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన బాబు ప్రజలకు వెన్నుపోటు పొడవడం ఓ లెక్కా అన్నారు. పేకాటను కూడా క్రీడల్లో చేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో అడ్డగోలుగా డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్‌కే చెల్లుతుందన్నారు. టీడీపీ మేనిఫెస్టో, బాబు, పవన్‌ కల్యాణ్‌ సంతకాలు చేసిన బాండ్లు, పత్రికా ప్రకటనల కాపీలను దహనం చేశారు.

చిలకలూరిపేటలో...

చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గురువారం చేపట్టిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం యడ్లపాడు మండలంలో విజయవంతం అయింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల హామీల అమలులో జాప్యాన్ని ఎండగడుతూ మాజీ మంత్రి విడదల రజని నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో ప్రతులను ప్రజలకు పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చాక అటకెక్కించిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. తహసీల్దార్‌ కార్యాలయం సెంటర్‌ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. అక్కడ టీడీపీ మేనిఫెస్టో ప్రతులను రోడ్డుపై పెట్టి తగులబెట్టారు. ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, మోసపూరిత వైఖరిని జనం ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ఉద్యమాన్ని చేపట్టామని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తాము విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.

పెదకూరపాడులో...

చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండేళ్లు గడిచిన సందర్భంగా పెదకూరపాడులో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్‌ సిక్స్‌, బాండ్ల ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శంకరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను ప్రజలను మోసం చేసిందన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు బుక్‌ లెట్‌లోని అంశాలను స్థానిక ప్రజలకు వివరించారు.

సత్తెనపల్లిలో....

మోసానికి చిరునామాగా చంద్రబాబు నిలిచారని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నిత్యం వంచిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం గురువారం జరిగింది. డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరిత ప్రచారం చేస్తోందన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారిపై టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.

వినుకొండలో...

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వినుకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి శివయ్య స్తూపం వరకు జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు బాసు లింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమంలో భాగంగా టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. స్థానిక సీఐ ప్రభాకర్‌ రావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో శివయ్య స్తూపం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మాచర్లలో....

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసగించడంపై మాచర్ల మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కొండా శివలింగరాజు ఆధ్వర్యంలో గురువారం విజయపురిసౌత్‌లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మంగారి గుడి నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ఈ కార్యక్రమం జరిగింది. మాచర్ల మండలానికి సంబంధించి జెడ్‌పీటీసీ పెద్ద మల్లుస్వామి, పార్టీ నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షుడు బూడిద శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి కోటిరెడ్డి, నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు గాదె శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గురజాలలో...

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసిందని, ఇది దగాకోరు ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి అంజిరెడ్డి హాస్పిటల్‌ సెంటర్‌లో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement