ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించిన చైతన్య
రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన యువకుడు గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్‌లో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణ యువకుడి అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
గుంటూరు మెడికల్: పెళ్లీడుకొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కళ్లెదుటే చనిపోయాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యులకు తన వంతు ఆర్థిక సహకారం అందిస్తున్న బిడ్డ ఏ అచ్చటా ముచ్చట తీరకుండానే అకాల మృత్యువుకు లోనయ్యాడు. యువకుడైన బిడ్డ చనిపోయి గుండెలు పిండేసే బాధలో ఉన్న తల్లిదండ్రులు తమ బాధను దిగమింగుకుంటూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి నూతన జీవితాలను ప్రసాదించేందుకు అవయవ దానం చేశారు. తల్లిదండ్రుల గొప్ప నిర్ణయంతో ఓ యువకుడి అవయవాలతో ప్రాణాపాయస్థితిలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించారు. ఆదివారం గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్‌లో జరిగిన మహత్కర సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నల్లపనేని వెంకటశివ, ఆదిలక్ష్మిల దంపతుల కొడుకు చైతన్య (25) శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా ఫిబ్రవరి 27న ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో తాటపూడి గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చైత్యన్య మెదడుకు తీవ్ర గాయాలు అవ్వటంతో కుటుంబ సభ్యులు అతడిని గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్‌లో చికిత్స కోసం చేర్పించారు. చైతన్యకు ఆసుపత్రిలో వైద్యుల బృందం చికిత్స అందించినా ఫలితం లేకపోయేసరికి 28న బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ జీవన్‌దాన్ చీఫ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యలవర్తి కార్తిక్ చౌదరి, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్‌లు కొడాలి అనూష, చింతమనేని అఖిలేష్‌లు చైతన్య తల్లిదండ్రులకు అవయవదానం ప్రాముఖ్యత గురించి వివరించారు. దీంతో యవకుడి తల్లిదండ్రులు బిడ్డను పొగొట్టుకున్న బాధలో ఉండి కూడా తమ బిడ్డ అవయవాలు వేరొకరికి నూతన జీవితాన్ని ఇస్తాయని తెలుసుకుని ముందుకొచ్చి అవయవదానం చేశారు.
తల్లిదండ్రుల పెద్దమనస్సు
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు హాస్పటల్‌లో చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నవయస్సులోనే రోడ్డు ప్రమాదంలో చైతన్య చనిపోవటం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పెంచి పెద్దచేసిన బిడ్డను కోల్పోయిన బాధలో ఉండి కూడా వెంకటశివ, ఆదిలక్ష్మి దంపతులు అవయవదానం చేయటం చాలా మంచి పని అని, వారి మంచి మనసుకు అభినందనలు తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు చైతన్య కుటుంబ సభ్యులను అభినందించి, వారి కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. చైతన్య అవయవదానంతో గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్స్‌లో తీవ్ర అనారోగ్యంలో ప్రాణాపాయస్థితిలో ఉండి చికిత్స పొందుతున్న ఇరువురు బాధితులకు ఆస్పత్రి వైద్య బృందం లివర్, కిడ్నీ అవయవాలు అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించారు. మరో కిడ్నీని విజయవాడ, రెండు నేత్రాలు ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు.


