ఉపాధ్యాయుల మెడపై కత్తి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల మెడపై కత్తి

Mar 2 2026 8:16 AM | Updated on Mar 2 2026 8:16 AM

ఉపాధ్యాయుల మెడపై కత్తి

ఉపాధ్యాయుల మెడపై కత్తి

పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత పేరుతో ఒత్తిడి విద్యార్థుల ఎదుటే హెచ్‌ఎంను తిట్టిన డీఈవో అధికారికంగా సెలవు పెట్టినా, హడావుడిగా పాఠశాలకు పిలిచి మరీ అవమానించడంతో మనస్తాపం ఆవేదనతో గుండెపోటుకు గురైన వైనం ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ప్రధానోపాధ్యాయుడు

డీఈఓ హెచ్చరికలతో ఆస్పత్రి పాలైన ప్రధానోపాధ్యాయుడు

గుంటూరు ఎడ్యుకేషన్‌: కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కాలాన్ని హరించి వేస్తున్న యాప్‌లతోపాటు ఉన్నతాధికారుల నుంచి అర్జెంట్‌ పేరుతో అడిగిందే తడవుగా సమాచారాన్ని పంపాలంటూ పెడుతున్న ఒత్తిడిని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు భరించలేకపోతున్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖాధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాల నుంచి పరీక్షలకు హాజరయ్యే ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా పాస్‌ అవ్వాల్సిందేనంటూ చేస్తున్న హెచ్చరికలతో రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి, ఏ విధంగా మాట్లాడుతారో, క్రమశిక్షణా చర్యల పేరుతో ఎటువంటి పనిష్మెంట్‌లు ఇస్తారో అని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు రాసేది విద్యార్థులు అయితే అంతకు పదింతలు తీవ్ర ఒత్తిడితో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అధికారంలోకి వస్తే జీవితాలను మార్చేస్తామని ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా, పదింతలు పని ఒత్తిడితో ఉపాధ్యాయుల మెడపై కత్తి పెట్టింది.

ఉపాధ్యాయ సంఘాల పరామర్శ

డీఈవో హెచ్చరికలతో ఆస్పత్రి పాలైన హెచ్‌ఎం శ్రీనివాసరావును పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. అధికారులు వ్యహరిస్తున్న తీరు సరికాదని, పరీక్షల పేరుతో తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడంతోపాటు పాఠశాలల సందర్శన సమయంలో వ్యక్తిగతంగా దూషించడం మానుకోవాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల ముందే తిట్టడం, అరవడం వంటి సంఘటనలపై గతంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు, ఆందోళనకు దిగిన విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సంఘాల నాయకులు చెబుతున్నారు.

గుంటూరు కేవీపీ కాలనీలోని కేఎస్సార్టీ నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాసరావు శనివారం గుండెపోటుతో లలితా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఆయన గత గురువారం వ్యక్తిగత పనులపై అధికారికంగా సెలవు పెట్టారు. అదేరోజు పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎక్కడ అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు ?. అయితే ఆయన సెలవు పెట్టారని చెప్పినప్పటికీ, పాఠశాలకు రావాలంటూ హడావుడిగా ఫోన్‌ చేసి పిలిపించారు. డీఈఓ పిలిచారని తెలియడంతో సదరు హెచ్‌ఎం శ్రీనివాసరావు పాఠశాలకు హడావుడిగా వచ్చారు. హెచ్‌ఎం వచ్చిన సమయానికి డీఈఓ సలీమ్‌ బాషా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. తరగతి గదిలోకి వచ్చిన హెచ్‌ఎంపై విద్యార్థుల ఎదుటే అకారణంగా సీరియస్‌ అవడంతోపాటు వెళ్లి ఆఫీస్‌ రూమ్‌లో వేచి ఉండాలని డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్‌ రూమ్‌కు వచ్చిన తరువాత ఇష్టారాజ్యంగా సెలవులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈఓ ఏకవచనంతో మాట్లాడటంతో సంబంధిత హెచ్‌ఎం తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఎదుట ఏకవచనంతో సంబోధించడంతోపాటు అధికారికంగా లీవ్‌ యాప్‌లో సెలవు నమోదు చేసినా, వ్యక్తిగత పనులపై ఉన్న హెచ్‌ఎంను పాఠశాలకు పిలిపించిన సంఘటన ఆయనలో తీవ్ర ఆవేదన కలిగించింది. అదే రోజు సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన హెచ్‌ఎం శ్రీనివాసరావు జరిగిన సంఘటనపై తీవ్రంగా కలత చెందారు. మనోవేదనతో గుండెపోటకు గురి కావడంతో శనివారం ఉదయం కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హెచ్‌ఎంను పరీక్షించిన వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement