కలెక్టర్ కృతికా శుక్లా
క్రీడల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
నరసరావుపేట ఈస్ట్: క్రీడల్లో పల్నాడు జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆకాంక్షించారు. శాప్ నిర్వహిస్తున్న నెలవారీ ఆటల పోటీల్లో భాగంగా జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించి జిల్లా జట్టు ఎంపిక చేశారు. పోటీలను ప్రారంభించిన కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని అన్నారు.
ఆటల ద్వారా క్రీడా స్ఫూర్తి అలవరుచుకొని జీవితంలో ఎదగాలని కోరారు. సైక్లింగ్ ఆరోగ్యకరమైన క్రీడగా పేర్కొన్నారు. సైకిల్ తొక్కడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు శరీరం చురుగ్గా ఉంటుందనీ, మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు. అండర్–18 జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
పోటీలను ఇస్సప్పాలెం–జొన్నలగడ్డ బైపాస్‌రోడ్డులో నిర్వహించారు. బాలబాలికల విభాగాలలో 8మంది చొప్పున 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 28వ తేదీ నుంచి విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్, మహిళా కార్యదర్శి వి.పద్మావతి, సైక్లింగ్ కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


