ప్రజలపై మరింత భారం
చార్జీల పెంపు పరిశీలిస్తే...
భూముల విలువ పెంపు పేరిట అదనపు రాబడికి చంద్రబాబు సర్కార్ సన్నాహాలు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రియల్ వ్యాపారం ఢమాల్ అంటూ పడిపోయింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ప్రజలపై రెండోసారి భారం మోపేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం రియల్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. రూ.లక్షలు, రూ.కోట్లు విలువ చేసే ప్లాట్లు, భూములను కొనుగోలు చేసేవారు లేక అప్పులకు వడ్డీలు పెరిగి అవస్థలు పడుతున్నారు. కొంత ధర తగ్గించి నష్టాలకై నా వాటిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నా కొనేవారే లేరు. ప్రస్తుతం అరకొరగా రియల్ వ్యాపారం చేస్తున్న వారికి పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు అదనపు భారం కానున్నాయి.
సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజలపై బాదుడే బాదుడు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నెత్తిన భారం మోపిన సర్కారు... ఇప్పుడు భూముల ధరలు మరోసారి పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ కమిషనర్ గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలను సవరించనున్నారు. దీనిపై ప్రజలు తమ సలహాలు, అభ్యంతరాలు తెలపాలని జిల్లా యంత్రాంగం కోరింది.
సవరణలు ఇలా...
ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల సవరణ ప్రక్రియను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చేపడతారు. సదరు భూముల విలువలను రెవెన్యూ, మున్సిపల్ పంచాయతీ అధికారులు సమన్వయంతో చర్చించి నిర్ణయిస్తారు. సవరించిన విలువలకు రివిజన్ కమిటీ ఆమోదముద్ర వేస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా .. ఈ నెల 25వ తేదీ నుంచి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రతిపాదిత ధరల వివరాలు పొందుపరిచారు. వీటిపై ఈ నెల 29వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించడం, డేటా ఎంట్రీ పూర్తి చేసి, చెక్ లిస్ట్ జనరేషన్, ఫారం ఒకటి – 1, 4 పరిశీలన, 30న అభ్యంతరాల పరిష్కారం, 31న మార్కెట్ విలువల సవరణ కమిటీల ద్వారా తుది అనుమతులు, ఫిబ్రవరి 1వ తేదీన పెరిగిన విలువ అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేసింది.
నివాస స్థలాలపై సైతం...
కమర్షియల్ స్థలాలు కాకుండా నివాస స్థలాలపై సైతం భారం మోపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీని వలన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి తోడు ఆర్‌సీసీ భవనాలు, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు, సెల్లార్, సినిమా హాళ్లు, పూరిల్లు, తదితర నిర్మాణాల విలువలను సైతం పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం చదరపు అడుగుకు 10 నుంచి 30 శాతం వరకు వాటి మార్కెట్ విలువ పెంచనున్నారు. ఫలితంగా సామాన్యులు సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడనుంది.
10 నుంచి 30 శాతం వరకు పెంపు...
జిల్లాలో భూముల విలువ పెంపుపై ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. సగటున 10 నుంచి 30 శాతం వరకూ పెంపుదల చేపట్టాలని ఆదేశించారు. దీనికి అనుకూలంగా జిల్లాలో భూముల ధరలు పెంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
భారీగా పెరగనున్న భూముల ధరలు
సంక్షోభంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం
నేటి వరకు సలహాలు,
సూచనలకు అవకాశం
ఫిబ్రవరి నుంచి పెంచిన ధరలు అమలు
గెజిట్ విడుదల చేసిన
చంద్రబాబు ప్రభుత్వం
10 నుంచి 30 శాతం
పెంచేందుకు అవకాశం
ప్రాంతాన్ని బట్టి మారనున్న ధరలు
చంద్రబాబు 18 నెలల పాలనలో
రెండోసారి పెంపు
జిల్లాలో క్రయవిక్ర యాలకు
సంబంధించి తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు
ప్రస్తుత భూముల రిజిస్ట్రేషన్లకు భూమి ధరలో 7.5 శాతం వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు భూమి ధర రూ. లక్ష ఉంటే 7.5 శాతం రిజిస్ట్రేషన్ అంటే రూ. 7,500 చెల్లించాలి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20 శాతం భూమి ధర పెరుగుతుంది. అంటే మార్కెట్ ధర రూ. 1.20 లక్షలు అవుతుంది. దీనికి 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ. 9 వేలు చెల్లించాలి. అదనంగా మరో రూ.1,500 రిజిస్ట్రేషన్ చార్జీ భారం ప్రజలపై పడనుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సవరణ కోసం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ ఆమోదంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని నోటీసు బోర్డు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ లో వివరాలు పొందుపరిచారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతాం.
–బి.అశోక్‌కుమార్,
సబ్ రిజిస్ట్రార్, సత్తెనపల్లి
ప్రజలపై మరింత భారం
ప్రజలపై మరింత భారం
ప్రజలపై మరింత భారం


