వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం
పిడుగురాళ్ల: శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి వారి కల్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న స్వామి వారి దేవాలయంలో ఈ వేడుక నిర్వహించారు. రథోత్సవం, తిరునాళ్ల మహోత్సవం ఘనంగా చేశారు. పిడుగురాళ్ల పట్టణానికి ఇదే పెద్ద పండుగ. కులమతాలకు అతీతంగా స్వామవారి తిరునాళ్లకు భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మహా అన్నదానం చేశారు. మధ్యాహ్న సమయంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. యువకులు భారీ సంఖ్యలో హాజరై జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ రథం లాగుతూ ముందుకు సాగారు. పోలీస్ స్టేషన్ నుంచి ఐలాండ్ సెంటర్ మీదుగా అడితీల సెంటర్ వరకు రథం నడిపించారు. తిరిగి అక్కడి నుంచి నేరుగా ఆలయానికి తీసుకొచ్చారు. తిరునాళ్ల వాతావరణం సందడిగా కనిపించింది. పలువురు దంపతులు పీఠలపై కూర్చొని స్వామి వారి కల్యాణాన్ని చేయించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
వైభవంగా ఆంజనేయ స్వామి రథోత్సవం


