మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అన్నిశాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంతరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక అమరేశ్వరాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి ఏర్పాట్ల సమన్వయ కమీటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్నానఘాట్‌ల వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించి తగినంత సిబ్బందిని నియమించాలన్నారు. విద్యుత్ శాఖాధికారులు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను చేయాలన్నారు. అలాగే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని ఆయన ఎకై ్సజ్‌శాఖాధికారులను ఆదేశించారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా అధికారులంతా సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖలపరంగా పూర్తిస్థాయి ప్రణాళికలను అనుసరించి వారి అవసరాలను కూడా వచ్చే సమావేశంలో వివరించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ డానియేల్, సీఐ అచ్చియ్య, ఆలయ ఈవో రేఖ, డీడీవో రాజగోపాల్, ఎంపీడీవో పార్వతిలతోపాటు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


