
సంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ
గుంటూరు ఎడ్యుకేషన్: సనాతన హిందూ ధర్మం ప్రకారం సంప్రదాయబద్ధంగా, పర్యావరణ హితంగా మండపాలతో గణేష్ మహోత్సవాలను శోభాయమానంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రరాజు అన్నారు. మంగళవారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రరాజు మాట్లాడుతూ.. ప్రజల్లో ఆధ్యాత్మిక భావన వెల్లువిరిసి మన సంస్కృతీసంప్రదాయాల ప్రకారం గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం సమితి పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఎవరికీ ఇబ్బంది లేని విధంగా మండపాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి లక్ష్మీపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయదలచిన భక్తులు సమితి ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావును సంప్రదించి దరఖాస్తు అందిస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. వివరాలకు 81064 33594 ఫోను నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మదన్ పురోహిత్, ఉపాధ్యక్షుడు హరిహరరాయలు, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సభ్యులు కంచర్ల ఆంజనేయులు, రవి శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రరాజు