లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): స్థల వివాదం నేపథ్యంలో కొందరు దాడి చేసి ఇంటిని, గృహోపకరణాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం శాంతినగర్ 4వ లైన్‌లో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. శాంతీనగర్‌లోని ఇంటిలో జాజుల ఏడుకొండలు, భార్య తిరుపతమ్మ ఉంటారు. వీరికి నలుగురు సంతానం. అదే ఇంట్లో అతని తమ్ముడు జాజుల బాల నరసింహారావు, అతని భార్య నాగమణి కూడా నివాసం ఉంటారు. ఏడుకొండలు, ఫైనాన్స్, గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. 2021లో శాంతీనగర్ 4వ లైన్‌లో 216 గజాల స్థలం శ్రీనివాసరావుపేటకు చెందిన కాశీవిశ్వనాథ్ కుమారుడు రవీంద్రబాబు వద్ద ఏడుకొండలు కొన్నాడు. రవీంద్రబాబుకు శ్రీనివాసరావుపేటకు చెందిన పెడమల్లు భాస్కర్‌ల మధ్య కోర్టులో స్థల వివాదం నడుస్తోంది. 2018లో రవీంద్రబాబుపై భాస్కర్ కోర్టులో గెలిచారు. 2021లో స్థలాన్ని రవీంద్రబాబు వద్ద నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని ఇల్లు ఖాళీ చేయాలంటూ, కోర్టులో తమకు పూర్తి అధికారాలు ఉన్నాయని మల్లు భాస్కర్ వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. శుక్రవారం ఏడుకొండలు, భార్య తిరుపతమ్మ బయటకు వెళ్లగా ఇంట్లో ఏడుకొండలు తమ్ముడు బాలనరసింహారావు, అతని భార్య నాగమణి ఉన్నారు. పెడమల్లు భాస్కర్ ఆయన సతీమణి భూలక్ష్మి పల్నాడు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుచరులు అయిన ఆలపాటి నాని, అశోక్‌లతోపాటు సుమారు 30 మందితో ఇంటిపైకి వచ్చి దాడి చేశారు. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు ధ్వంసం చేశారు. బాధితులు 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగరంపాలెం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అందరినీ అక్కడి నుంచి తరిమేసి పెద్దమల్లు భాస్కర్‌ని అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితులు తేరుకొని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కుని ఫిర్యాదు చేశారు.
ఇల్లు, ఇంట్లో గృహోపకరణాలు ధ్వంసం నిందితులు అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులుగా గుర్తింపు ! పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
స్థల వివాదం నేపథ్యంలో ఇంటిపై దాడి
స్థల వివాదం నేపథ్యంలో ఇంటిపై దాడి