యథేచ్ఛగా ‘బరి’తెగింపు !
నియోజకవర్గంలో జోరుగా కోడిపందేలు గుండాట, కోతముక్కాట సైతం.. దొండపాడులో బరిని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కొనకంచివారిపాలెంలో పెద్ద ఎత్తున పోటీలు కన్నెత్తి చూడని పోలీసులు
సాక్షి నెట్‌వర్క్: కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం... అంటూ బీరాలు పలికిన పోలీసులు తమకు సమీపంలోనే బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు ఆడుతున్నా మిన్నకుండిపోయారు. నియోజకర్గంలో బుధవారం కోడిపందేలు, జూదం యథేచ్ఛగా నిర్వహించారు. మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. పందేల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఉండే జిల్లా కేంద్రానికి సమీపంలోనే బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించడం కొసమెరుపు. రెండు రోజుల క్రితం వరకు బరులు ధ్వంసం చేసి హడావుడి చేసిన అధికారులు బుధవారం మాత్రం అటువైపు కన్నైత్తి చూడలేదు. నరసరావుపేట మండలం దొండపాడులో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కోడిపందేల బరిని సందర్శించి పోటీలను ప్రారంభించారు. మంగళవారం పోటీలకు సిద్ధం చేసిన రెండు బరులను పోలీసులు ధ్వంసం చేశారు. బుధవారం బరులను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ వెంట పోలీసు ఎస్కార్ట్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక్కడ గుండాట, కోతముక్కలను నిర్వహించారు. పోటీలకు హాజరైన వారికి మద్యం, బిర్యానీ అందుబాటులో ఉంచారు. రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెంలో కోడిపందేలు జోరుగా సాగాయి. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టెంట్‌లో బరిని ఏర్పాటు చేసి పోటీలు జరిపారు. పందేంరాయళ్లు పెద్దఎత్తున కోళ్లను తీసుకువచ్చి పోటీల్లో పాల్గొన్నారు. జూదం పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో పాటు పలు గ్రామాల్లో కూడా కోడిపందేలు జరిగాయి.
యథేచ్ఛగా ‘బరి’తెగింపు !


