వైద్యకళాశాలల ప్రైవేటీకరణ జీఓల దహనం
నరసరావుపేట ఈస్ట్: రపభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థల పరం చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో పీపీపీ జీఓ కాపీలను భోగి మంటల్లో దహనం చేసారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ప్రభుత్వం వైద్య విద్యపై ఇచ్చిన జీఓలపై గగ్గోలు పెట్టిన చంద్రబాబు, కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యవిద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించుకొని వైద్య కళాశాలలను ప్రభుత్వ అధీనంలోనే నడపాలని హితవు పలికారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, షేక్ చినజాన్ సైదా, కోవై శ్రీను, జక్రం, దీనమ్మ తదితరులు పాల్గొన్నారు.


