మంగళగిరి టౌన్: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ మహిళను మంగళగిరి పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పట్టణ ఎస్‌ఐ రవీంద్రనాయక్ తెలిపిన వివరాల మేరకు... పాత మంగళగిరికి చెందిన రామిశెట్టి సాయిలక్ష్మి నివాసానికి అద్దెకు ఇల్లు కావాలంటూ ఓ మహిళ వచ్చింది. మాట కలిపాక ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కుని బయటకు పరిగెత్తింది. సాయిలక్ష్మి పెద్దగా కేకలు వేయడంతో ఆ మహిళ చైన్‌ను అక్కడ వదిలేసి పారిపోయింది. సోమవారం మంగళగిరి రత్నాలచెరువు అండర్‌పాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా విజయవాడకు చెందిన మానసవాణి అని, గతంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి 42 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మానసవాణిపై విజయవాడలో సింగ్‌నగర్, కృష్ణలంకలో రెండు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని విచారణలో తెలిసినట్లు తెలిపారు. మానసవాణిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రవీంద్రనాయక్ తెలిపారు.
42 గ్రాముల బంగారం స్వాధీనం