చంద్రబాబు పాలనతో రాష్ట్రం రావణకాష్టం
లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని డైవర్టు చేసేందుకే దాడులు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి అంబటి రాంబాబుపై టీడీపీ మూకల దాడికి ఖండన అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని డిమాండ్ పోలీసుల వైఫల్యమే దాడికి కారణమని ఆరోపణ
అంబటి కుటుంబానికి ప్రాణహాని
నరసరావుపేట: చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రావణకాష్టంలా తయారైందని, ఆటవిక రాజ్యం కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండించారు. తిరుపతి–తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇలా వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతోందన్నారు. గుంటూరులో అంబటిపై దాడి పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యమే అన్నారు. మనం పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. పార్టీ పిలుపు మేరకు తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారానికి సంబంధించి దేవాలయంలో పూజ ముగించుకొని వస్తుండగా కారుపై టీడీపీ నాయకులు దాడి చేసి రెచ్చగొట్టేలా మాట్లాడటంతో అంబటి భావోద్వేగానికి లోనై కొన్ని మాటలు మాట్లాడారని పేర్కొన్నారు. చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పారన్నారు. అయినప్పటికీ టీడీపీ నాయకులు పలు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి కర్రలు, ఇనుపరాడ్లతో ఆయన ఇంటిపై దాడికి పాల్పడటం హేయమన్నారు. ఇల్లు, కారును కూడా తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారని తెలిపారు. ఇంట్లోని మహిళలు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇంటిపై దాడి చేసి దారుణానికి వడిగట్టారని అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని బాధ్యతయుతమైన పదవిలో ఉండి కూడా ఉద్రిక్తతలు పెంచేలా మాట్లాడటం సరికాదని అన్నారు.
అంబటి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వారికి ఏదైనా జరిగితే టీడీపీ, లోకేష్ బాధ్యత వహించాలని డాక్టర్ గోపిరెడ్డి హెచ్చరించారు. వినుకొండ, చిలకలూరిపేట ప్రాంతాల్లో కూడా బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజినిపై ఇటువంటి దాడులు జరిగాయని చెప్పారు. పార్టీ యావత్తు అంబటి రాంబాబుకు సంఘీభావంగా నిలబడుతుందని తెలియజేశారు. ఈ దాడిలో స్థానిక ఎమ్మెల్యే, ఆయన భర్త కూడా స్వయంగా పాల్గొనడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. జరిగిన సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


