మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా ఖోయిర్పూట్ సమితి కుడుములగుమ్మలోని పీఎం శ్రీ ప్రభుత్వ నోడల్ పాఠశాలలో ఆదివారం సురభి మండల స్థాయి బాలల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి సృజనాత్మకతను అభివృద్ధి చేసేందుకు సురభి ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుంది. మండల పరిధిలోని 11 క్లస్టర్ల నుంచి మొత్తం 220 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ గండ్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖోయిర్ పూట్ పంచాయతీ సమితి అధ్యక్షుడు బిఘ్న కిర్సానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా జిల్లా పరిషత్ సభ్యుడు బలి మాఝీ, సామాజిక కార్యకర్త ఆనంద్ చార్కి, కుడుములుగుమ్మ సర్పంచ్ మంగళ మాడీ, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ దాస్, పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రదీప్ కుమార్ నాయక్, ఏబీఈఓ సునాధర్ బటే, పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఉమాశంకర్ దాస్ ,ప్రధానోపాధ్యాయుడు బలరాం పూజారి తదితరులు పాల్గొన్నారు. మహోత్సవంలో వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, సంగీతం, క్విజ్, సృజనాత్మక రచన తదితర పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా విజేతలకు బహుమతులు అందజేశారు.


