భువనేశ్వర్: రెండు తలలు, ఒకే శరీరంతో జ న్మించిన మగ శిశువు ఆదివారం మృతి చెందాడు. బరంపురం ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆస్పత్రి ఎస్ఎన్వీయూలో ఏడు రోజుల చికిత్స పొందుతూ మరణించాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కంధమల్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల మహిళ తొలి కానుపులో ఈ శిశువుని ప్రసవించింది. 32 వారాలకు పైగా గర్భవతిగా ఈ నెల 11న స్పైనల్ సిజేరియన్ సెక్షన్ ద్వారా 2.25 కిలోల బరువున్న నెలలు నిండని మగ శిశువు జన్మించాడు. ఈ పరిస్థితిని వైద్యపరంగా డైసెఫాలిక్ పారాపగస్ అంటారని ఎంకేసీజీ సూపరింటెండెంట్ తెలిపారు. ఇది కవలల పుట్టుకలో అత్యంత అరుదైన రూపం. దీనిలో రెండు తలలు ఒకే శరీరానికి పక్కపక్కనే అతుక్కుని ఉంటాయి. అంతర్గత అవయవాలను పంచుకునే స్థాయి ఒక్కో కేసులో ఒక్కో విధంగా ఉంటుందన్నారు.


