● ఎం.ఎస్.ఎస్ డిమాండ్
జయపురం: మహిళలపై దాడులు అరికట్టాలని, మాదక ద్రవ్యాలు నియంత్రించాలని అఖిల భారతీయ మహిళా సంస్కృతిక సంఘం డిమాండ్ చేసింది. జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సాహిద్ లక్ష్మణ నాయిక్ గ్రంథాలయ ప్రాంగణంలో సంఘం కొరాపుట్ జిల్లా సమావేశం ఆదివారం జరిగింది. సంఘ జిల్లా అధ్యక్షురాలు జయంతి దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. జిల్లా నలుమూలల నుంచి వందలాదిమంది మహిళలు పాల్గొన్నారు. సంఘ కార్యదర్శి లక్ష్మీబారిక్ నివేదికను సభకు సమర్పించి సంఘ కార్యకలాపాలను సభికులకు వివరించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వయం ప్రభ నాయిక్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు, హత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పాలకులు మాత్రం మహిళలకు రక్షణ కల్పించటం లేదని దుయ్యబట్టారు. అలాగే ప్రతి చోట బహిరంగంగా మాదక ద్రవ్యాలు, నాటుసారా అమ్ముతున్నా సంబంధిత అధికారులు స్పందించటంలేదన్నారు. దీంతో శాంతిభద్రతలు క్షీణిస్తూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. పలు గ్రామాలలో మహిళలు, మహిళా సంఘాలు మద్యం అమ్మకాలు నిలుపు చేయాలని ఆందోళనలు జరుపుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిందించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దృష్టిసారించి వెంటనే వారికి రక్షణ కల్పించాలని, అలాగే సమాజంలోఅశాంతికి కారణమైన నాటుసారాతో పాటు అన్ని మాదక ద్యవ్యాల అమ్మకాలను నిలిపి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే మహిళా సంస్కృతిక సంఘం ప్రజాందోళన చేపడుతోందని హెచ్చరించారు. ముఖ్యఅతిథిగా మాజీ అధ్యక్షురాలు సొయిద పరవిణీ హాజరయ్యారు. సమావేశం అనంతరం సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా జయంతి దాస్, కార్యదర్శిగా లక్ష్మీ బారిక్, ఉపాధ్యక్షురాలుగా మాధురి మధుశ్మిత, సహాయ కార్మదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పాణిగ్రహిలతో పాటు మరో పది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.


