జయపురం: జయపురం దసరా మహోత్సవాలకు రాజ కుటుంబీకులను దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆహ్వానించారు. జయపురం రాజ్మహల్కు వెళ్లి ఈ నెల 20 వ తేదీన దసరా పోడియలో జరుగనున్న దసరా మహోత్సవాల్లో పాల్గొనాలని జయపురం రాజమాత, మహారాణి సరిత దేవిని ఆమె కుమారుడు కుమార రాజు విశ్వంబర చంధ్రచుడ్ దేవ్లను ఆహ్వానించారు.
జంట నగరాల్లో దసరా రద్దీ నియంత్రణకు చర్యలు
భువనేశ్వర్: దుర్గా పూజ ఉత్సవాల సందర్భంగా భువనేశ్వర్, కటక్ జంట నగరాల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు నివారణకు జంట నగరాల పోలీసు కమిషనరేట్ అదనపు పోలీసు బలగాలను మోహరించింది. ఈ నెల 22 వరకు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఈ బలగాలు పని చేస్తాయి. భువనేశ్వర్ వ్యాప్తంగా మొత్తం 73 మంది పోలీసు అధికారులు, 15 ప్లాటూన్ల భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ ఉమాకాంత ప్రధాన్ తెలిపారు. కటక్ నగర వ్యాప్తంగా 60 ప్లాటూన్ల పోలీసు సిబ్బంది, 500 మంది అధికారులు, రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలను మోహరిస్తున్నట్లు కటక్ డీసీపీ ఖిలారి రిషికేష్ జ్ఞానదేవ్ తెలిపారు. కటక్ నగరంలో పలు చోట్ల సుమారు 170 దుర్గా పూజా మండపాలను ఏర్పాటు చేశారు. నగర పర్యవేక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 57 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, 1,300 సీసీ టీవీ కెమెరాలను అమర్చినట్లు వివరించారు.


