టెక్కలి రూరల్ : టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం ఓ యువతి బస్సు నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైంది. ఇచ్ఛాపురం మండలం శీలగం గ్రామానికి చెందిన నర్తు సమీర అనే యువతి పాతపట్నం మండలం లంబ గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోంది. అమ్మమ్మ, చెల్లితో కలిసి శనివారం టెక్కలి వచ్చింది. తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. బస్సు తీసే సమయానికి అమ్మమ్మ, చెల్లి రాకపోవడంతో బస్సు ఆపమని చెప్పి తలుపు వద్దకు వచ్చి దిగే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా జారిపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం సేకరించారు. కాగా, గాయపడిన యువతిని ఆస్పత్రికి తీసుకురావడాన్ని గుర్తించిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి పీఆర్ఓ శ్రీకాకుళం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లేలా కుటుంబ సభ్యులను ఒత్తిడిచేశారు. అందుకు వారు అంగీకరించలేదు. ఆస్పత్రిలో కొంత మంది సిబ్బంది సైతం పీఆర్ఓలకు సహకరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక మెళియాపుట్టి రోడ్డులో గొట్టాల ఫ్యాక్టరీ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి నుంచి గూడేం వైపు టి.ఢిల్లీ, టి.జానకిరావులు ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డుపై నడిచివెళ్తున్న గొట్టాల ఫ్యాక్టరీ వాచ్‌మేన్ పి.ఆదినారాయణను ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడటంతో స్థానికులు స్పందించి టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదినారాయణ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు నమోదు చేశారు.
కారు ఢీకొని గొర్రెలకాపరి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీజగన్నాథపురం పంచాయతీ బిర్లంగి గ్రామానికి చెందిన యువకుడు శనివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆవల రాంబాబు(25) తన గొర్రెలను తీసుకుని పొడుగుపాడు సమీపంలోని తోటలో మేపుతూ రోడ్డు దాడుతుండగా టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, కారు సమీప డివైడర్‌ను ఢీకొట్టింది. కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాంబాబుకు తండ్రి భూషణరావు, తల్లి పారమ్మ, సోదరి హారతి ఉన్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కోటబొమ్మాళి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు
మందస: అంబుగాం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దున్నూరు గ్రామానికి చెందిన దున్న తాతారావు బ్యాంకు పని నిమిత్తం హరిపురం సైకిల్‌పై బయల్దేరాడు. అంబుగాం వచ్చేసరికి ద్విచక్ర వాహనచోదకుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో తాతారావు గాయపడటంతో హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించారు.
వృథాగా తాగునీరు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నగరంలోని హడ్కోకాలనీలో మున్సిపల్ హైస్కూల్ పక్కనే వీధి కుళాయి పాడైపోయింది. దీంతో తాగునీరు వృథాగా పోతోంది. చాలా కాలనీల్లో నీరు దొరక్క ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం వృథాగా పోతున్నా కార్పొరేషన్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ఈ విషయమై కాలనీవాసులు పలుమార్లు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.


