● నాలుగేళ్లుగా ఆచూకీ లేని విశ్రాంత జవాను అప్పలరాజు ● 2022లో వంశధారి నదిలో గల్లంతు ● ఆచూకీ లభించక కుటుంబ సభ్యులకు ఇబ్బందులు
ఎల్.ఎన్.పేట : దేశ సరిహద్దులో విధులు నిర్వహించి ప్రజల భద్రత కోసం సేవలందించిన విశ్రాంత బీఎస్ఎఫ్ జవాన్ కురమాన అప్పలరాజు కుటుంబం నేడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎల్.ఎన్.పేట ఇందిరానగర్ కాలనీకి చెందిన అప్పలరాజు 2016లో ఉద్యోగ విరమణ చేశారు. గ్రామంలో నివసిస్తూ 2022 సెప్టెంబర్ 27న వంశధార నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నప్పటికీ నేటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. గల్లంతై నాలుగేళ్లు పూర్తయినా మృతదేహం లభించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పలరాజుకు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త గల్లంతైన నాటి నుంచి కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తి లేకపోవడంతో పిల్లల భవిష్యత్, రోజువారీ ఖర్చులు ఆమెకు ఆందోళనగా మారాయి. పంచాయతీరాజ్శాఖ, పోలీసు అధికారులను సంప్రదించగా తమ నిబంధనలు తమకు ఉన్నాయని, అప్పలరాజు మృతదేహం లభిస్తేనే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయగలమని చెబుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణ ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో విశ్రాంత జవాన్కు సంబంధించి పింఛన్తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగ సంబంధిత ప్రయోజనాలు అందడం లేదని వాపోతున్నారు. పిల్లల చదువులతో పాటు ఇంటి ఖర్చులకు డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియక సతమతమవుతున్నామని విలపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల పరిధిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని మాజీ జవాను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దేశ సేవ చేసిన విశ్రాంతి జవాను కుటుంబం ఇలా అనిశ్చితిలో మిగిలిపోకుండా మానవతా దృక్పథంతో చొరవ చూపాలని కన్నీటితో వేడుకుంటున్నారు.


