అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రసాదాల విభాగంలో టెండరుదారుల నిర్లక్ష్యం భక్తులకు అవస్థలను తెచ్చిపెడుతోంది. పులిహోర ప్రసాదం విక్రయాలకు సిద్ధం చేసేందుకు వినియోగిస్తున్న కవర్లు నాశిరకంగా ఉండటంతో పులిహోర వేయగానే కిందభాగం కూడా ఓపెన్ అయ్యింది. శనివారం ఉదయం నుంచి వందలాది పులిహోర ప్యాకెట్లు కవర్లు చిరిగిపోవడంతో భక్తులు వేరే కవర్లలో పులిహోర నింపుకోవాల్సి వచ్చింది. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ప్రసాద విభాగ సిబ్బందిని నిలదీశారు. దీంతో సదరు విభాగ బాధ్యులు ప్రత్యామ్నాయ చర్యలకు దిగారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన కవర్లును సప్లయి చేయాల్సిన టెండర్దారుడు.. నాణ్యత విషయంలో దృష్టి పెట్టకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని భక్తులు వాపోయారు. ఈ విషయమై ప్రసాదాల విభాగాల సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. కవర్లు క్రింద భాగం సరిగ్గా ప్లాస్ట్ అవ్వలేదని గుర్తించామని, ఈవో దృష్టికి తీసుకెళ్లి సదరు కాంట్రాక్టర్కు సమాచారం ఇచ్చామన్నారు. నాణ్యమైన కవర్లు మాత్రమే ఇవ్వాలని ఆదేశించినట్లు వివరించారు.


