● ఎర్రకోట రామలీలలో నిషాదరాజుగా జుయెల్ ఓరాం
భువనేశ్వర్: కేంద్ర మంత్రిగా విధుల నిర్వహణలో నిత్యం తలమునకలయ్యే ఆయన ... ఒక్కసారిగా రంగస్థల నటుడిగా మారారు. రాజకీయ హోదాను పక్కనపెట్టి, రామాయణంలో శ్రీరాముని ఆత్మీయ మిత్రుడిగా పేరొందిన నిషాదరాజు పాత్రలో ఒదిగిపోయారు. ఒడిశాకు చెందిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయెల్ ఓరాం ఢిల్లీలోని ఎరక్రోట మైదానంలో ప్రసిద్ధ లవకుశ్ రామలీల వేదికపై బుధవారం (అక్టోబర్ 14) నిషాదరాజుగా అభినయించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
గిరిజన నేపథ్యంతో ప్రత్యేక అనుబంధం
రామాయణంలో శృంగవేరపుర రాజైన నిషాదరాజు గుహకు శ్రీరామునితో ఉన్న స్నేహం విశిష్టమైనది. శ్రీరాముడు వనవాసానికి బయలుదేరిన సందర్భంలో సీతాదేవి, లక్ష్మణుడితో సహా ఆయన శృంగవేరపురానికి చేరుకోగా నిషాదరాజు ఆప్యాయంగా స్వాగతిస్తాడు. గంగానది తీరంలో వారికి ఆతిథ్యమిచ్చి, మరుసటి రోజు వీడ్కోలు పలికే ఘట్టాన్ని రామలీలలో ప్రదర్శించారు. నిషాదరాజు పాత్రను పోషించే అవకాశం రావడాన్ని మంత్రి జుయెల్ ఓరాం ప్రత్యేక గౌరవంగా భావించారు. ఈ పాత్రకు తన గిరిజన నేపథ్యంతోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. నిషాదరాజు వారసత్వానికి చెందిన వ్యక్తిగా, ఆయనలోని కొన్ని లక్షణాలు తనలోనూ ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. లవకుశ్ రామలీల నిర్వాహకులు సుమారు పది రోజుల ముందుగా ఆహ్వానించడంతో ఈ పాత్రను పోషించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
స్నేహం.. సమానత్వానికి ప్రతీక
నిషాదరాజు పాత్ర భారతీయ సంస్కృతిలో స్నేహానికి, మానవీయ విలువలకు ఉన్న ఉన్నత స్థానాన్ని చాటుతుందని ఓరాం పేర్కొన్నారు. శ్రీరాముడు, నిషాదరాజు మధ్య అనుబంధం ప్రేమ, సామరస్యం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన రామలీల వేదికపై ఈ పాత్రకు జీవం పోయడం తనకు భావోద్వేగభరితమైన, గర్వకారణమైన, ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
రాజకీయ ప్రముఖులకు సైతం రామలీల వేదిక
ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించే లవకుశ్ రామలీల దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామాయణ ప్రదర్శనల్లో ఒకటి. ఇందులో గతంలోనూ పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ పాత్రలు పోషించారు. ఈసారి కేంద్ర దళిత వ్యవహారాల శాఖ మంత్రి జుఝెల్ ఓరాం నిషాదరాజుగా కనిపించడం విశేష ఆకర్షణగా నిలిచింది. రాజ్యాధికారం, సామాజిక హోదాలతో సంబంధం లేకుండా నిజమైన స్నేహం, ఆతిథ్యం, పరస్పర గౌరవం ఎంత విలువైనవో నిషాదరాజు ఘట్టం గుర్తుచేస్తుంది. గిరిజన సంస్కృతికి చెందిన పాత్రకు కేంద్ర మంత్రి స్వయంగా రంగస్థలంపై జీవం పోయడం ఈ సందేశానికి మరింత ప్రాధాన్యాన్ని తీసుకొచ్చింది.


