అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యం అన్నదాన ప్రసాదాన్ని వందలాది మంది భక్తులు స్వీకరిస్తుంటారు. అందుకు తగినట్లుగా ఆలయ అధికారులు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దేవుడు అందరికీ దేవుడే.. ప్రసాదం అందరికీ ప్రసాదమే.. అయినప్పటికీ వాణిజ్య పరమైన నిబంధనలు, నిర్ణయాలకు సంబంధిత అధికారులు వత్తాసు పలకడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీంతో నిజమైన భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి దర్శనానికి వస్తున్న భక్తులకు మాత్రం అన్నప్రసాదం సరిగ్గా అందని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..
అరసవల్లి ఆదిత్యాలయంలో ఇంద్రపుష్కరిణి పునర్నిర్మాణ పనులు ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. సుమారు రూ.4 కోట్లతో జరుగుతున్న పనులను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో నిత్యం 35 నుంచి 40 మంది వరకు కూలీలను పనులకు వినియోగిస్తున్నారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఈ పనులకు వచ్చిన లేబర్‌కు భోజన వసతులను సదరు కాంట్రాక్టరే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సుమారు 40 మందికి ఒక్కొక్కరికి కనీసం రూ.100 చొప్పున రోజుకు రూ.4 వేల వరకు ఖర్చులను కాంట్రాక్టర్ భరించాల్సి ఉంది. అయితే పనులు వివిధ దశల్లో ఉన్న క్రమంలో కొన్ని రోజులు ఎక్కువ సంఖ్యలో మరికొన్ని రోజులు తక్కువ మంది కూలీలు వస్తుంటారు. అయినప్పటికీ సగటున రోజుకు రూ.3 వేల వరకై నా భోజన ఖర్చులను కాంట్రాక్టర్ భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన నెలకు రూ.90 వేల వరకు వినియోగించాల్సి ఉంది. సుమారు ఐదు నెలలకు గాను రూ. 4.50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఇవన్నీ కాంట్రాక్టర్‌కు మిగిల్చేలా ఆలయానికి చెందిన కీలకాధికారి కనుసన్నల్లో పెద్ద వ్యవహారమే నడిచింది. లేబర్‌కు భోజనాలు నిత్యాన్నదాన విభాగంలో పెట్టించండి...అంటూ మౌఖిక ఆదేశాలివ్వడంతో పాటు అధికారికంగా రోజూ సుమారు 30 నుంచి 35 భోజనాల టోకెన్లు ఇప్పించేలా చర్యలు చేపట్టారు. దీంతో కూలీలు సైతం ఇక్కడే మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందని ద్రాక్షలా మారింది. ఈ వ్యవహారం మూడు నెలల క్రితమే ఆలయ ఈవో దృష్టికి వెళ్లినా.. అధికారికంగా టోకెన్లు ఇస్తూ..కాంట్రాక్టర్‌కు ఖర్చులు మిగిలేలా కొమ్ముకాస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
2 గంటలు దాటితే అన్న ప్రసాదం లేనట్టే!
అరసవల్లిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు నిత్యాన్నదాన ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంటారు. దాతల విరాళాల వడ్డీలతో నిత్యం ఇక్కడ సాధారణ రోజుల్లో సుమారు 400 నుంచి 500 మందికి, ఆదివారాల్లో 800 నుంచి 1000 మంది వరకు భోజన ప్రసాదాలు అందిస్తుంటారు. ఇందులో సుదూర ప్రాంతాల నుంచి దర్శనాలకు వస్తున్న భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఇక్కడే సమస్య ఉత్పన్నమైంది. పుష్కరిణి పనులకు వస్తున్న లేబర్ పనులకు వస్తున్న కూలీలకు ఇక్కడ భోజనాలు పెడుతుండడంతో నిజమైన భక్తులకు మధ్యాహ్నం 2 గంటలు దాటితే నిత్యాన్నదాన ప్రసాదం అందకుండా పోతోంది. ఇక్కడ భక్తులంటే అందరూ ఒక్కటే ..ఎవరైనా తినవచ్చు అని భావిస్తున్నప్పటికీ..కాంట్రాక్టర్ క్రింద పనులకు వస్తున్న వారికి రోజూ ఇక్కడ అన్లిమిటెడ్ భోజనాలు అందివ్వడమే వివాదాస్పదమైంది. కాంట్రాక్టర్ చేతి ఖర్చులను మిగిల్చేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న ఈవో వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకుని ఆలయానికి దర్శనాలకు వస్తున్న భక్తులందరికీ అన్నదాన ప్రసాదం అందించేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
పుష్కరిణి పనులకు వచ్చిన కూలీలకూ నిత్యం ఇక్కడే భోజనాలు
ఐదు నెలల నుంచి రోజూ ఇక్కడే
తింటున్నా పట్టించుకోని అధికారులు
కాంట్రాక్టర్ భరించాల్సిన భోజన
ఖర్చులకు వత్తాసు పలుకుతున్న వైనం
ఇప్పటివరకు కాంట్రాక్టర్‌కు రూ.4.50 లక్షల వరకు మిగిల్చిన అధికారులు
పరిశీలిస్తాం..
ఇదే విషయమై నిత్యాన్నదాన పథకం విభాగం సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తాను ఉదయమే కొత్తగా బాధ్యతలు స్వీకరించానని, పరిస్థితులను పరిశీలిస్తానని, ఈవో దృష్టికి తీసుకువెళ్తానంటూ స్పష్టం చేశారు. ఇంతవరకు ఇక్కడి విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన వెంకటరమణ వద్ద ప్రస్తావించగా మౌనమే సమాధానమయ్యింది.


