భువనేశ్వర్: రాష్ట్రంలో మొబైల్ ఇ–సేవా వ్యాన్లు వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో, హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రీ అధికారులందరి సమక్షంలో ప్రధాన న్యాయమూర్తి హరీష్ టాండన్ రెండు వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. కేసుల విచారణ తదితర వ్యవహారాలకు న్యాయస్థానాలకు చేరుకోలేని వర్గాలకు సౌకర్యం కల్పించేందుకు ఈ వ్యవస్థని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మారుమూల, వెనుకబడిన ప్రాంతాలకు డిజిటల్ కోర్టు సేవలు, న్యాయ సహాయం, వివాద పరిష్కార సౌకర్యాలను ఇంటి ముంగిట కల్పించేందుకు మొబైల్ ఇ – సేవా వ్యాన్ల వ్యవస్థ దోహదపడుతుంది. దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న సాక్షులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తమ ఇంటి వద్ద నుంచే వాంగ్మూలాలను నమోదు చేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి. ఇందులో హైస్పీడ్ మల్టీ–నెట్వర్క్ కనెక్టివిటీ, హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు, పవర్ బ్యాకప్ సిస్టమ్లు అమర్చారు. సేవల ప్రారంభం పురస్కరించుకుని కటక్ సదర్ పరిధి లోని అదాలియాలో నివసిస్తున్న ఒక కీలక సాక్షి నుంచి ఈ వ్యాన్ ద్వారా సాక్ష్యం నమోదు చేశారు. అనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయిన ఆ సాక్షి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక కేసులో ఉన్న చోటు నుంచి సాక్ష్యం ఇచ్చారు.
జగత్పూర్లో అవగాహన శిబిరం..
డిజిటల్ న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒడిశా రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ జగత్పూర్లోని వీక్లీ మార్కెట్లో అవగాహన శిబిరాన్ని నిర్వహించింది. వ్యాన్లోని పెద్ద మల్టీమీడియా డిస్ప్లే, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఇ–ఫైలింగ్, ఇ– చెల్లింపు, కేసు స్థితిని పర్యవేక్షించడం, ఇ– ములాకత్ వంటి సౌకర్యాల పని తీరు, ఉపయోగం పౌరులకు వివరించారు.
చేతుల పరిశుభ్రత తప్పనిసరి
పర్లాకిమిడి: సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవంత్సరం విద్యార్థులు గుసాని సమితి ఉప్పలాడలో టాగోర్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చేతుల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సునీత తదితరులు పాల్గొన్నారు.


