రాయగడ: తొమ్మిదేళ్ల విరామం అనంతరం జరిగిన రాయగడ అటానమస్ కళాశాల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. అనంతరం ఎన్నికల లెక్కింపు కార్యక్రమం పోలీసుల కట్టుదిట్టమైన భద్రత చర్యల మధ్య కొనసాగాయి. అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు బాహాటంగానే తమ మద్దతును ప్రకటించాయి. 2026–27 సంవత్సరానికి గాను జరిగిన ఈ విద్యార్థి సంఘం పోరులో అధ్యక్షునిగా సుమిత్ రత్నాలు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్ రాత్రి 7.30 గంటల సమయంలో ప్రకటించారు. రత్నాలు ఏబీవీపీ మద్దతుతో విజయం సాధించారు. విద్యార్థి సంఘం ఉపాధ్యక్షునిగా బిశ్వజీత్ నాయక్, కార్యదర్శిగా కలక భాను, సహ కార్యదర్శిగా రాహుల్ కరకరియాలు విజయం సాధించారు. డ్రామాటిక్ సెక్రటరీగా నీలిమా నాయక్, కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శిగా గణశ్యామ్ నాయక్, అథ్లెటిక్ కార్యదర్శిగా బిష్ణు కొండగిరి, బాయ్స్ కామన్రూం కార్యదర్శిగా దేవాశీష్ మెలక, కామర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా చందన్ నాయక్, ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా టంకధర్ పాణి, గర్ల్స్ కామన్ రూం కార్యదర్శిగా రోహిత్ తాడింగి, సహ కార్యదర్శిగా దీపాలి ప్రధాన్లు ఎన్నికై నట్లు ప్రకటించారు.


