న్యూస్రీల్
ఈ నెల 22 నుంచి ప్రత్యేక ఆచారాలు అమలు
పంచుక నాలుగు రోజులే..
బొంకొచూడ అలంకరణ రద్దు
హబిష్యాళీలకు
ఆన్లైన్ నమోదు
శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
శ్రీమందిరంలో..
భువనేశ్వర్ : పూరీలోని జగన్నాథ ఆలయంలో కార్తీక మాస వ్రతాలు, ప్రత్యేక అలంకరణలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది తిథి క్షయం కారణంగా సాధారణంగా ఐదు రోజులపాటు నిర్వహించే పంచుక వ్రతం నాలుగు రోజులకే పరిమితం కానుంది. ద్వాదశి తిథి క్షయం వల్ల జగన్నాథ స్వామి బొంకొచూడ అలంకరణను నిర్వహించడం లేదు. ఛొత్తీషా నియోగుల సమావేశంలో ఈ ఏడాది కార్తీక మాస క్రతువుల షెడ్యూల్ను ఖరారు చేసినట్లు పూరీ కలెక్టర్ దివ్యజ్యోతి పరిడా వెల్లడించారు.
●ఈ నెల 22 నుంచి నవంబర్ 24 వరకు శ్రీమందిరంలో కార్తీక మాస ప్రత్యేక ఆచారాలు నిర్వహించనున్నారు. కార్తీక వ్రత దీక్షలు మాత్రం అక్టోబర్ 26 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగనున్నాయి. ఈ నెల రోజుల్లో ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల మధ్య జగన్నాథ స్వామికి రాధా దామోదర అలంకరణ నిర్వహిస్తారు. నెలంతా ప్రత్యేక బాల ధూప సేవ కూడా కొనసాగుతుంది.
రాధా దామోదర అలంకరణ..
కార్తీక మాసంలో జగన్నాథ స్వామికి నిర్వహించే రాధా దామోదర అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ అలంకరణలో స్వామివారిని రాధా దామోదర రూపంలో దర్శించుకోవడం కార్తీక వ్రతంలో భాగంగా భావిస్తారు. నెల రోజులపాటు జరిగే ఈ ప్రత్యేక అలంకరణను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీక్షేత్రానికి తరలివస్తారు.
పంచుక నాలుగు రోజులే..
కార్తీక మాసంలోని చివరి ఐదు రోజులను పంచుకగా పిలుస్తారు. ఈ కాలం విష్ణు ఆరాధనకు, ఉపవాస నియమాలకు అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. అయితే ఈ ఏడాది చంద్ర తిథుల క్షయం కారణంగా పంచుక వ్రతం నాలుగు రోజులే జరగనుంది. ఈ సమయంలో శ్రీమందిరంలో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహిస్తారు.
బొంకొచూడ అలంకరణ లేనట్లే..
కార్తీక మాసంలో జగన్నాథ స్వామికి నిర్వహించే ప్రత్యేక అలంకరణల్లో బొంకొచూడ అలంకరణ కూడా ఒకటి. తలపై వాలుగా ఉండే ప్రత్యేక బంగారు కిరీటం ఈ అలంకరణలో ప్రధాన ఆకర్షణ. అయితే ఈ ఏడాది ద్వాదశి తిథి క్షయం కారణంగా ఈ అలంకరణను నిర్వహించడం లేదని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
నవంబర్ 16న హరిహర అలంకరణ
కార్తీక మాసంలో ప్రత్యేకంగా నిర్వహించే హరిహర అలంకరణను నవంబర్ 16న చేపట్టనున్నారు. హరి, హర తత్త్వాల సమన్వయాన్ని ప్రతిబింబించే ఈ అలంకరణకు ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు.
ఐదు అలంకరణలు..
కార్తీక శుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉండే చివరి ఐదు రోజులను పంచుకగా పిలుస్తారు. ఈ కాలం విష్ణు ఆరాధనకు, ఉపవాస నియమాలకు అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. సాధారణంగా ఈ ఐదు రోజుల్లో శ్రీ జగన్నాథుడు ఐదు విశిష్ట అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తారు.
● ఏకాదశి (నవంబరు 21) – లక్ష్మీనారాయణ అలంకరణ: ఠియాకియా అలంకరణగా కూడా పిలిచే ఈ అలంకరణలో స్వామివారు బంగారు ఆభరణాలు, వస్త్రాలతో లక్ష్మీనారాయణ స్వరూపంలో దర్శనమిస్తారు.
● త్రయోదశి (నవంబరు 22) – త్రివిక్రమ అలంకరణ: వామనుడు త్రివిక్రముడిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన అవతార వైభవాన్ని ప్రతిబింబించేలా స్వామివారిని అలంకరిస్తారు.
● చతుర్దశి (నవంబరు 23)– లక్ష్మీనసింహ అలంకరణ: దళికియా అలంకరణగా కూడా వ్యవహరించే ఈ అలంకరణలో ప్రత్యేక బంగారు ఆభరణాలు, కిరీటాలు, పుష్పాకతుల అలంకారాలు ఉంటాయి.
● పౌర్ణమి (నవంబరు 24) – రాజరాజేశ్వర అలంకరణ: సునా బేషొగా ప్రసిద్ధి చెందిన ఈ అలంకరణలో స్వామివారు బంగారు ఆభరణాలతో రాజసంగా దర్శనమిస్తారు. కార్తీక మాస వ్రతాల ముగింపు సందర్భంగా ఈ అలంకరణ నిర్వహిస్తారు.
ఈ ఏడాది తిథుల మార్పుల కారణంగా పంచుక ఆచారాల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బొంకొచూడ అలంకరణ లేకపోవడం భక్తులు గమనించాల్సిన అంశం. మిగిలిన అలంకరణలు నిర్ణీత తిథుల ప్రకారం నిర్వహించనున్నారు.
కార్తీక వ్రతాన్ని పూరీలో ఆచరించాలనుకునే మహిళల కోసం ఒడిశా ప్రభుత్వం హబిష్యాళీ పథకం కింద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది 2,500 మంది మహిళలకు ఉచిత వసతి, శ్రీమందిరంలో క్రమబద్ధమైన దర్శనం, మహాప్రసాదం అందించనున్నారు. బందావతి నివాస్, మున్సిపల్ కల్యాణ మండపం, రైల్వే టూరిస్ట్ కాంప్లెక్స్లలో వసతి కల్పించనున్నారు. ఈ పథకానికి అక్టోబర్ 6 నుంచి ఒడిశా ప్రభుత్వ ఈ–డిస్ట్రిక్ట్ పోర్టల్ (https://edistrict.odisha.gov.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 70 ఏళ్లలోపు వితంతువులు, 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2,500 మంది లక్ష్యం నిండే వరకు నమోదు కొనసాగుతుంది. ఎంపికై న హబిష్యాళీలకే ఈ పథకం కింద ప్రత్యేక వసతి, ఇతర సదుపాయాలు లభిస్తాయి.
– కార్తీక మాసంలో శ్రీమందిరాన్ని సందర్శించే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం గుండా లోనికి ప్రవేశం కల్పించి మిగిలిన 3 ద్వారాల గుండా వెలుపలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించారు. సింహ ద్వారం గుండా ప్రవేశం, 7 మెట్ల గుండా ప్రధాన ఆలయంలోని ప్రవేశం ప్రాంతాల్లీ ఈ వర్గీయుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లను శ్రీ మందిరం, జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులు, పోలీసు వర్గాలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాయి. అదనంగా వైద్య బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రత్యేక అలంకరణలు, వ్రత నియమాలు, పూజా కార్యక్రమాలతో శ్రీక్షేత్రం కార్తీక మాస ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.


