జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వర్సిటీలో చదువుతున్న 4,374 మంది విద్యార్థుల్లో కేవలం 2,225 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఓటు వేసేందుకు వెళ్లిన విద్యార్థులను వర్సిటీ ప్రధాన గేటు వద్ద పక్కాగా తనిఖీ చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఓటు వేసేందుకు 22 బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహించేందుకు ప్రతీ బూత్ వద్ద ఐదుగురు చొప్పున ఉద్యోగులను నియమించారు. విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్ పార్టీల అనుబంధ విద్యార్థి యూనియన్లు తలపడ్డాయి. సాయంత్రం ప్రారంభమైన ఓట్ల లెక్కింపుతో ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.


