ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

భువనేశ్వర్‌: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతర పురోగతి, నిబద్ధతతో పాలన కొనసాగాలని రాష్ట్ర మాజీ గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి ఆకాంక్షించారు. పదవీ కాలం ముగియడంతో సతీ సమేతంగా రాష్ట్ర ఆరాధ్య దైవం జగన్నాథని దర్శించుకున్నారు. రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సు, నిరంతర పురోగతితో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం వర్ధిల్లాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. పదవీ కాలం ముగింపు పురస్కరించుకుని పలువురు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఆయనకు సాదరంగా వీడ్కోలు పలికారు.

పాముకాటుతో వ్యక్తి మృతి

రాయగడ: చెట్టుకింద నిద్రిస్తున్న సమయంలో పాముకాటు వేయడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని పద్మపూర్‌ శిలాపొదొరొలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమపేట ప్రాంతానికి చెందిన నిలపాల సురేష్‌ (40)గా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. పద్మపూర్‌లోని శిలాపొదొరొ ప్రాంతంలో ఉన్న ఒక రైస్‌మిల్‌కు సురేష్‌ ధాన్యాన్ని తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అన్‌లోడింగ్‌ పూర్తయిన తర్వాత రాత్రి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో విషపూరితమైన పాము అతనిని కాటు వేసింది. దీంతో అక్కడివారు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్కార్పియో ఢీకొని వ్యక్తి మృతి

● ఏడుగురి పరిస్థితి విషమం

భువనేశ్వర్‌: నగరంలో స్కార్పియో ఎస్‌యూవీ 10 వాహనాలను ఢీకొట్టి ఒక వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఈ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మొదట నువాగాంవ్‌ చక్‌ సమీపంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. స్థానికులు వాహనాన్ని వెంబడించినప్పటికీ, స్కార్పియో అతి వేగంగా దూసుకుపోయి మరో 9 వాహనాలను ఢీకొట్టింది. చివరకు ఎస్‌యూఎం ఆసుపత్రి ప్రధాన ద్వారం సమీపంలోని రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.

ఆగ్రహించిన స్థానికులు దాడి చేసి డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. స్కార్పియో వాహనంలో డ్రైవర్‌తో సహా ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షి కథనం. డ్రైవర్‌ను పట్టుకోగా, వాహనంలోని మిగతా ముగ్గురు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. స్కార్పియో డ్రైవర్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు భువనేశ్వర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శరవణ వివేక్‌ ఎం తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. డ్రైవర్‌కు నిర్వహించిన బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో మద్యం సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement