జయపురం: జయపురం సమితి స్థాయి–2026 సురభి ఉత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. జయపురం పాయిక సాహీ ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సమితిలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంతీయ సాధన కేంద్ర సమన్వయకర్త విజయలక్ష్మీ స్వైన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ విభాగ అదనపు అధికారి కె.గోపాలరావు పాల్గొన్నారు. ఆయన సురభి కార్యక్రమ ప్రాధాన్యతను వివరిస్తూ.. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇది చక్కని వేదిక అన్నారు. విద్యార్థులకు తర్కం, వ్యాసరచన, ఉపన్యాసం, సృజనాత్మక రచనలు, క్విజ్, కథల రచన, గణిత క్విజ్, చిత్రలేఖనం, శిల్పకళ, చిత్రకళ, సంగీతం, సాంస్కృత పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ అజిత్ బెహర, కలియగాం సీఆర్సీసీ రామేశ్వర పండ, పాయికసాహి ఉన్నత ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గీతాంజళి బెహర తదితరులు పాల్గొన్నారు.


