జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికలకు అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) మ్యానిఫెస్టో బుధవారం విడుదల చేసింది. విద్యార్థి యూనియన్ అధ్యక్ష పదవికి ఏబీవీపీ నుంచి పోటీ చేస్తున్న జ్యోతి రంజన్ పాణిగ్రహి మ్యానిఫెస్టో వివరాలు స్థానికంగా ఉన్న ఒక హాటల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వర్సిటీలో మౌలిక సౌకర్యాల కల్పనకు తాము ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము ఏ రాజకీయ పార్టీ నాయకుడి సహాయం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జరగాలని కోరారు. ఎన్నికల ప్రచారం చేయాలన్న ఆలోచన తమకు లేదని, అయితే మిగతా విద్యార్థి సంఘాలు ఎన్నికల ప్రచారం ప్రారంభించడంతో తాము కూడా ప్రచారం ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. అలాగే ఉపాధ్యక్షునిగా దినేష్ పాణిగ్రహి, ప్రధాన కార్యదర్శిగా పి.హోమేశ్వరి, సహాయ ప్రధాన కార్యదర్శిగా పరశురాం గొలారి, క్రీడా కార్యదర్శిగా ఆశుతోష్ మహంతి, నాట్య విభాగ కార్యదర్శిగా పద్మశ్రీ గొలారి, మీడియ కార్యదర్శిగా పోలక్ పట్నాయిక్, సైన్స్ కార్యదర్శిగా అమితా తిరేకీ, డేస్కాలర్ అసోసియేషన్ కార్యదర్శిగా సుభమ్ నాయిక్, గర్ల్స్ కామన్ రూమ్ అధ్యక్షురాలిగా లిసా మహాపాత్రోలు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.


